English | Telugu
'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కి కొత్త దర్శకుడు.. ఎవరో తెలుసా?
Updated : Jul 12, 2023
'బాహుబలి-2' స్థాయి వసూళ్లు రాబట్టలేకపోయినప్పటికీ, 'ఆర్ఆర్ఆర్' మూవీ అంతర్జాతీయ స్థాయిలో అంతకుమించిన గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, 'నాటు నాటు' పాటకి గాను ఆస్కార్ సహా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది ఆర్ఆర్ఆర్. ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది కాబట్టే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ సైతం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఆర్ఆర్ఆర్'కి సీక్వెల్ ఉంటుందని తెలిపారు. ఆర్ఆర్ఆర్-2 హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని, అయితే దీనికి రాజమౌళి దర్శకత్వం వహించవచ్చు లేదంటే ఆయన పర్యవేక్షణలో మరొకరు డైరెక్ట్ చేసే అవకాశముందని విజయేంద్రప్రసాద్ చెప్పారు. దీంతో ఒకవేళ రాజమౌళి కాకపోతే ఆర్ఆర్ఆర్-2 డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే చర్చ నడుస్తోంది. అయితే ఆ అవకాశం రాజమౌళి తనయుడు కార్తికేయను వరించే అవకాశముందని వినికిడి.
కొంతకాలంగా రాజమౌళి సినిమాల మేకింగ్ లో కార్తికేయ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 'ఆర్ఆర్ఆర్' సినిమా విషయంలో మేకింగ్ దగ్గర నుంచి ఆస్కార్ వరకు కార్తికేయ కృషి ఎంతో ఉందని రాజమౌళి సహా మూవీ టీమ్ అంతా ప్రశంసించారు. రాజమౌళికి కుడి భుజంగా వ్యవహరించే కార్తికేయకు అన్ని విభాగాలపై మంచి పట్టు ఉందని అంటుంటారు. కార్తికేయ భవిష్యత్ అడుగులు కూడా దర్శకత్వం దిశగానే ఉన్నాయి. కార్తికేయకు దర్శకుడయ్యే అనుభవం వచ్చిందని, పైగా ఆర్ఆర్ఆర్ తో మొదటి నుంచి చివరి వరకు ట్రావెల్ అయిన అతనికి ఆ సినిమాతో ఎంతో కనెక్షన్ ఉందని, అందుకే 'ఆర్ఆర్ఆర్-2'తో దర్శకుడిగా పరిచయం చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి రాజమౌళి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ చిత్రం రాజమౌళి పర్యవేక్షణలో కార్తికేయ దర్శకత్వంలో రూపొందే అవకాశముందని వినికిడి. రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1'కి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఇప్పుడు కార్తికేయ కోసం రాజమౌళి ఆ బాధ్యత తీసుకోబోతున్నారని సమాచారం.