English | Telugu

‘సలార్‌’ ఆ సినిమాకి రీమేక్‌.. ఇది నిజమేనా?

ఒక స్టార్‌ హీరో సినిమా చేస్తున్నాడంటే దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ కంటే రూమర్లే ఎక్కువ ప్రచారంలోకి వస్తాయి. ఏ సమాచారమైనా క్షణాల్లో లభిస్తుండడంతో రూమర్లు కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంటాయి. ఇప్పుడు ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ‘సలార్‌’ సినిమాకి సంబంధించిన ఓ రూమర్‌ అత్యంత వేగంగా స్ప్రెడ్‌ అవుతోంది. ‘సలార్‌’ సినిమా రీమేక్‌ అనేది ఆ వార్త. ఇది సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

ప్రశాంత్‌ నీల్‌ ‘ఉగ్రం’ అనే కన్నడ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో శ్రీమురళి, హరిప్రియ జంటగా నటించారు. పూర్తి యాక్షన్‌ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్నే అందుకుంది. ఈ సినిమానే ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’గా రీమేక్‌ చేస్తున్నాడని వేసిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. దానికి గల కారణాలు కూడా ఆ పోస్ట్‌లో ఉన్నాయి. ‘ఉగ్రం’ చిత్రాన్ని జీ5, హంగామా, వూట్‌ వంటి యాప్స్‌ నుంచి తొలగించడంతో ‘సలార్‌’ రీమేక్‌ అని కన్‌ఫర్మ్‌ అయ్యిందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికితోడు ఉగ్రం సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ‘సలార్‌’ రీమేక్‌ అని వస్తున్న వార్తకు బలం చేకూర్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ వార్తను ఖండిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ వంటి డైరెక్టర్‌ ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోతో రీమేక్‌ చెయ్యాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు. 

ప్రభాస్‌, శ్రుతిహాసన్‌ జంటగా తెరకెక్కుతున్న ‘సలార్‌’ చిత్రాన్ని మొదట సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ చెయ్యాలని భావించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చాలా పెండిరగ్‌ ఉండడంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. డిసెంబర్‌ 22న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్‌. ఈ సినిమా కోసం అన్ని భాషల చిత్ర పరిశ్రమలు, ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ‘సలార్‌’ రీమేక్‌ అంటూ వస్తున్న వార్తలో ఎంత వరకు నిజం ఉంది అనేది సినిమా రిలీజ్‌ అయితేనేగానీ తెలీదు.