English | Telugu

హీరో నితిన్‌ ఎన్నికల ప్రచారం.. ఏ పార్టీ కోసమో తెలుసా?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీలు తమ అభ్యర్థుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ కాస్త ముందుంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగతా పార్టీలు కూడా తమ అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో ఉన్నాయి. ఎన్నికల హడావిడి మొదలైందంటే సినిమా తారలు ఏదో ఒక పార్టీ తరఫున ప్రచారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో హీరో నితిన్‌ పాల్గొనే అవకాశం ఉంది. అయితే అతను ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తాడు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ సినీ గ్లామర్‌ని ప్రచారం కోసం ఉపయోగించుకుంటూనే ఉంది. ఇప్పుడు తెలంగాణలో హీరో నితిన్‌ని రంగంలోకి దింపాలని ఆలోచిస్తోందని తెలుస్తోంది. నితిన్‌ మేనమామ, పీసీసీ కార్యదర్శి నగేష్‌రెడ్డి నిజామాబాద్‌ రూరల్‌ సీటును ఆశిస్తున్నారని సమాచారం. నగేష్‌రెడ్డికి సీటు ఇస్తే ఆయన తరఫున నితిన్‌ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఇది పార్టీకి బాగా కలిసి వస్తుందని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. మరి నగేష్‌రెడ్డికి సీటు ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అదే జరిగితే కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసేందుకు నితిన్‌ రంగంలోకి దిగే అవకాశం ఉంది.