English | Telugu
ఆ హీరోతో సాయిపల్లవి సినిమా అంటే అది రేర్ కాంబినేషనే అవుతుంది!
Updated : Jun 6, 2024
ఒకటి రెండు సినిమాలతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం నత్త నడకగా వెళుతోంది. ఇటీవలికాలంలో విజయ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి. మళ్ళీ ఓ సాలిడ్ హిట్ వస్తేనేగానీ అతని కెరీర్ ఓ ట్రాక్‌లోకి రాదు. తాజాగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించే సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. లవ్‌స్టోరీగా రూపొందే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా ఓకే అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి సినిమా మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే సాయి పల్లవి కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని ఎప్పటి నుంచి రౌడీ ఫ్యాన్స్ అనుకుంటున్న విషయం తెలిసిందే. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందన్న వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.
ప్రేమమ్ చిత్రంతో అందర్నీ ఆకట్టుకున్న సాయిపల్లవి ఆ తర్వాత చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ప్రేమకథా చిత్రాలే ఉన్నాయి. ఎక్స్‌పోజింగ్‌కి నో చెప్పే సాయిపల్లవి ఇప్పటివరకు చేసిన సినిమాలు తక్కువే అయినా తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఫిదా చేసేసింది. ప్రేమమ్, ఫిదా, లవ్‌స్టోరీ వంటి సినిమాలతో మంచి విజయాల్ని అందుకున్న సాయిపల్లవి.. విజయ్ దేవరకొండ సినిమాలో ఓకే అయిందన్న వార్త నిజమే అయితే ఇదో రేర్ కాంబినేషన్‌లో అవుతుందనడంలో సందేహం లేదు. సాయి పల్లవి ప్రస్తుతం తను కమిట్ అయిన సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తండేల్, అమరన్ సినిమాలకు పనిచేస్తోంది. వీటితోపాటు బాలీవుడ్‌లో కూడా రెండు సినిమాలు చేస్తోంది.