English | Telugu
'దేవర'లో సాయి పల్లవి!
Updated : Jun 27, 2023
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'దేవర'. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ నటిస్తున్న తదుపరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర ఉందని, దానికోసం సాయి పల్లవిని ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది.
సినిమాల ఎంపిక విషయంలో సాయి పల్లవి మొదటినుంచి ఆచితూచి అడుగులు వేస్తుంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎక్కువగా చేస్తూ వస్తుంది. 'దేవర'లో సినిమాకి ఎంతో కీలకమైన ఓ ముఖ్యమైన పాత్ర కోసం సాయి పల్లవిని కొరటాల శివ సంప్రదించినట్లు తెలుస్తోంది. కథ, పాత్ర నచ్చి ఈ సినిమాలో నటించడానికి ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. 'విరాటపర్వం' తర్వాత తెలుగులో సాయి పల్లవి నటించనున్న సినిమా ఇదే అంటున్నారు. కాగా ఎన్టీఆర్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది నటన. అలాగే సాయి పల్లవి కూడా తన అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈ ఇద్దరు కలిసి నటిస్తే కన్నుల పండుగలా ఉంటుంది అనడంలో సందేహం లేదు.