English | Telugu

ఊహించని కాంబో.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ వైపు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే మరోవైపు నార్మల్ బడ్జెట్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఎవరూ ఊహించని విధంగా ఓ దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు హరీష్ శంకర్ అంటున్నారు.

'మిరపకాయ్', 'గబ్బర్ సింగ్' వంటి సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హరీష్ శంకర్. హీరోలను ఆయన చూపించే విధానం, హీరోల చేత పలికించే పంచ్ డైలాగ్ లు ఫ్యాన్స్ ని మెప్పించేలా ఉంటాయి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ భారీ సినిమాలు చేస్తుండటంతో ఆయన నుంచి 'బుజ్జిగాడు', 'డార్లింగ్' తరహా సినిమాలు కూడా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హరీష్ శంకర్ సినిమా అంటే 'బుజ్జిగాడు' తరహా యాక్షన్ ఎంటర్టైనర్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అయితే హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన ప్రభాస్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముందని సమాచారం. అయితే ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశముందని అంటున్నారు. 

కాగా ఇటీవల 'ఆదిపురుష్'తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ చేతిలో 'సలార్', 'ప్రాజెక్ట్ k', మారుతి సినిమా, 'స్పిరిట్' వంటి చిత్రాలున్నాయి. 'సలార్' ఈ సెప్టెంబర్ 28 న విడుదల కానుంది. 'ప్రాజెక్ట్ k' వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా వేసవికి విడుదల కానుంది. మారుతి సినిమా షూటింగ్ దశలో ఉంది.