English | Telugu

రామ్‌చరణ్‌ సరసన సచిన్‌ టెండూల్కర్‌ కూతురు.. ఇక ఫ్యాన్స్‌కి పండగేనా?

రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’పై ప్రేక్షకుల్లో చరణ్‌ అభిమానుల్లో, శంకర్‌ అభిమానుల్లో చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్‌ 16వ సినిమా కూడా ఓకే అయిన విషయం తెలిసిందే. ‘ఉప్పెన’ వంటి సూపర్‌హిట్‌ మూవీని తెరకెక్కించిన సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. డైరెక్టర్‌ బుచ్చిబాబు ఈ సినిమాలోని నటీనటుల ఎంపిక జరుపుతూ ఎంతో బిజీగా ఉన్నారు. 

ఇదిలా ఉంటే...ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే.. ఇండియన్‌ క్రికెట్‌ స్టార్‌ సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ ఈ సినిమాలో రామ్‌చరణ్‌తో జతకట్టబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని హీరోయిన్‌ క్యారెక్టర్‌కి సారా కరెక్ట్‌గా సరిపోతుందని దర్శకుడు బుచ్చిబాబు భావిస్తున్నాడట. ఆమెను రామ్‌చరణ్‌ కొత్త సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

ఇంతకుముందు ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించబోతోందనే వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వస్తుందని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు సారా టెండూల్కర్‌ పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్‌ చేస్తారు, ఎవరి పేరును ఎనౌన్స్‌ చేస్తారనేది చిత్ర యూనిట్‌పైనే ఆధారపడిరది. ఒకవేళ సారా ఓకే అయితే చరణ్‌ ఫ్యాన్స్‌కి, టెండూల్కర్‌ ఫ్యాన్స్‌కి ఇది స్వీట్‌ న్యూస్‌ అనే చెప్పాలి.

రామ్‌చరణ్‌ కెరీర్‌లో ఇప్పటివరకు పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా చెయ్యలేదు. ఫస్ట్‌టైమ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ పొలిటికల్‌ డ్రామాగా రూపొందుతోందని తెలుస్తోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చరణ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.