English | Telugu

ఇదేం కాంబినేషన్‌రా నాయనా.. వర్కవుట్‌ అవుతుందా?

ఇదేం కాంబినేషన్‌రా నాయనా.. వర్కవుట్‌ అవుతుందా?

టాలీవుడ్‌లోని మాస్‌ హీరోల గురించి చెప్పాల్సి వచ్చినపుడు రవితేజ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అతను హీరోగా మంచి పొజిషన్‌కి రావడానికి కారణం మాస్‌ సినిమాలే. కొన్ని క్లాస్‌ సినిమాలు కూడా చెయ్యాలని ట్రై చేశాడు. కానీ, వర్కవుట్‌ అవ్వలేదు. హీరోగా కెరీర్‌ స్టార్ట్‌ చేసి పాతిక సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది ఈగల్‌, మిస్టర్‌ బచ్చన్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఆ రెండు సినిమాలూ డిజాస్టర్స్‌గా మిగిలిపోయాయి.  ఆ అనుభవంతో సినిమాల ఎంపిక విషయంలో కొంచెం జాగ్రత్త పడుతున్నాడు. 

ప్రస్తుతం ‘మాస్‌ జాతర’ అనే సినిమా చేస్తున్నాడు. టైటిల్‌లోనే మాస్‌ ఉంది కాబట్టి సినిమాలో మాస్‌ జాతరే అంటున్నారు. భోగవరపు భాను దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోసారి రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఈ సినిమా తర్వాత రవితేజ చేసే సినిమా ఒక్కటి కూడా లేకపోవడం. ఒక సినిమా తర్వాత చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేకపోవడం రవితేజ కెరీర్‌లో ఇదే ప్రథమం. అయితే అఫీషియల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్‌ లేకపోయినా ఒక సినిమాకి ఓకే చెప్పాడని మాత్రం వినిపిస్తోంది. 

నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి క్లాస్‌ సినిమాలను డైరెక్ట్‌ చేసిన కిశోర్‌ తిరుమలతో రవితేజ ఒక సినిమా చెయ్యబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే రవితేజకు కిశోర్‌ కథ చెప్పి ప్రాజెక్ట్‌ ఓకే చేయించుకున్నాడని సమాచారం. మాస్‌ జాతర రిలీజ్‌ అయిన తర్వాత ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా మొదలైందని సమాచారం. రవితేజ మాస్‌ హీరో, కిశోర్‌ తిరుమల క్లాస్‌ డైరెక్టర్‌. అసలు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అది ఎలాంటి సినిమా అవుతుందో మరి. గతంలో రవితేజ జస్ట్‌ ఫర్‌ ఛేంజ్‌ కోసం కొన్ని క్లాస్‌ సినిమాలు చేసి దెబ్బతిన్నాడు. మరి కిశోర్‌ కాంబినేషన్‌లో చేసే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.