English | Telugu
ఇదెక్కడి గొడవ.. టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పనున్న రాజమౌళి?
Updated : Feb 10, 2025
దక్షిణ భారత సినీ పరిశ్రమ ఇప్పుడు బాలీవుడ్‌ని శాసించే స్థాయికి ఎదిగింది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో పూర్తి స్థాయి పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయంటే దానికి ముఖ్య కారకుడు ఎస్.ఎస్.రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచ మార్కెట్‌లోకి మన సినిమాలు దూసుకెళ్లేందుకు ఒక మార్గాన్ని చూపించి చాలా తక్కువ సమయంలోనే సౌత్ సినిమాలకు మంచి ఎలివేషన్ తీసుకొచ్చారు. ఆయన చూపించిన మార్గంలోనే ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ వెళుతున్నారు. తన తొలి సినిమా విజయవంతం అయిన తర్వాత వరసగా తన కెరీర్ గ్రాఫ్‌ని పెంచుకుంటూ వస్తున్న రాజమౌళి ప్రపంచ మార్కెట్‌లోకి తెలుగు సినిమా ఎంట్రీ ఇవ్వగలదు, తనకి అలాంటి సినిమాలు హ్యాండిల్ చేసే సత్తా ఉంది అని నిరూపించుకునేందుకు ‘మగధీర’ ప్రాజెక్ట్‌ని ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన రోజే ‘బాహుబలి’ చిత్రానికి బీజం పడింది. అప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తూనే ఉన్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో ఆ సినిమాను తెరకెక్కించి బాలీవుడ్‌లోని బడా డైరెక్టర్లు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు రాజమౌళి.
తన టార్గెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది బాహుబలి సిరీస్‌తో పూర్తిగా అర్థమైంది. ఆ సినిమా మేకింగ్ కావచ్చు, సినిమా ప్రమోషన్ కోసం ఎంపిక చేసుకున్న మార్గాలు కావచ్చు.. ఆ విషయాన్నే చెబుతున్నాయి. ఆ సినిమా తర్వాత చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో సంచలనం. ఆస్కార్ అనే కలను తన సినిమాతో నిజం చేసిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు కూడా. కానీ, రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం మహేష్ పూర్తిగా రాజమౌళి కంట్రోల్‌లోకి వెళ్లిపోయారు. రాజమౌళి ఆలోచనల్లోని హీరోని ఆవిష్కరించేందుకు మహేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మహేష్‌తో చేసే సినిమా తర్వాత రాజమౌళి టాలీవుడ్‌కి దూరం కాబోతున్నారనే వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. అయితే అందులో నిజమెంత అనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి నెక్స్‌ట్ టార్గెట్ హాలీవుడ్ అనీ, ఇకపై అక్కడి నుంచే ప్రపంచ సినిమాను శాసిస్తాడని, ఇకపై రీజనల్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం లేదని.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి పేరు ఇంటర్నేషనల్ స్థాయిలో వినిపిస్తుండడంతో హాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయని చెబుతున్నారు. ఇది నిరాధారమైన వార్తే అయినప్పటికీ టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లాలి అని ఒక డైరెక్టర్ అనుకోవడంలో తప్పులేదు. అలా వెళితే తెలుగు వారి గౌరవం విశ్వవ్యాప్తం అవుతుంది.
రాజమౌళి ఇక తెలుగు సినిమాలు చేయడు అనే ప్రచారం జరగడానికి ముఖ్య కారణం మహేష్‌తో చేస్తున్న సినిమాకి సంబంధించిన ఒక ఒప్పందం అనే అనుమానం వస్తోంది. అదేమిటంటే.. ఎస్‌ఎస్‌ఎంబి29 కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థతో రాజమౌళి అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమాను 72 దేశాల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ఆ ఓటీటీ సంస్థ ప్రణాళిక సిద్ధం చేసుకుందట. అంతటి భారీ స్థాయి రిలీజ్ తర్వాత రాజమౌళి పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది. కాబట్టి తెలుగు హీరోలతో రాజమౌళి సినిమాలు చేసే అవకాశాలు ఉండవు అనే వాదన వినిపిస్తోంది. అందుకే రాజమౌళి హాలీవుడ్‌పైనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఏమిటి అనేది రాజమౌళి మాత్రమే చెప్పగలరు.