English | Telugu

బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్!

భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్.. ప్రస్తుతం 'లక్కీ భాస్కర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మలయాళ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు ఇతర స్టార్ల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. కమల్ హాసన్ 234 మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ 'కల్కి 2898 AD'లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా 'భగవంత్ కేసరి'తో ఘన విజయాన్ని అందుకున్న బాలకృష్ణ తన తదుపరి సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 109 సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో దుల్కర్ నటించనున్నాడని వినికిడి. 

బాబీ గత చిత్రం 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి హీరోగా నటించగా, రవితేజ ముఖ్య పాత్రలో నటించాడు. ఆ సినిమా విజయంలో రవితేజ రోల్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 'NBK 109'లో కూడా కథకి కీలకమైన చాలా ముఖ్యమైన పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం దుల్కర్ ని సంప్రదించగా, ఆయన వెంటనే అంగీకరించినట్లు సమాచారం.

తనకి 'సీతారామం' వంటి ఘన విజయాన్ని అందించిన వైజయంతీ మూవీస్ కోసం 'కల్కి 2898 AD'లో కీలక పాత్ర చేయడానికి అంగీకరించిన దుల్కర్.. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ 'లక్కీ భాస్కర్'ను నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ కోసం 'NBK 109'లో నటించడానికి అంగీకరించాడని అంటున్నారు.