English | Telugu

‘లియో’లో రామ్‌చరణ్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌.. ఎంతవరకు నిజం?

ఒక టాప్‌ హీరో సినిమాలో మరో టాప్‌ హీరో అతిథిగా నటించడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నదే. ఇప్పుడు యంగ్‌ హీరోలు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఈమధ్యకాలంలో చాలా సినిమాల్లో హీరోలు గెస్టులుగా నటించారు. ఇప్పుడు రామ్‌చరణ్‌ వంతు వచ్చినట్టుంది. తమిళ్‌ హీరో విజయ్‌, లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘లియో’ అక్టోబర్‌ 19న పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ గెస్ట్‌గా కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు ఏమిటో తెలియదుగానీ, వార్త మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌చరణ్‌ పేరు వినిపించడానికి రీజన్‌ కూడా ఉందని తెలుస్తోంది. 

అదేమిటంటే.. అమెరికాలో ‘లియో’ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభమైంది. వాటిలోని ఒక బుకింగ్‌ సంస్థ వెబ్‌సైట్‌లో ‘లియో’ చిత్రంలో నటించిన వారి వివరాలను ఇచ్చారు. అందులో రామ్‌చరణ్‌ పేరు కూడా ఉందట. దాంతో అభిమానులు తమ హీరో ‘లియో’లో నటించాడని కన్‌ఫర్మ్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తలో నిజమెంత, అబద్ధమెంతో తెలుసుకోవాలంటే అక్టోబర్‌ 19 వరకు ఆగాల్సిందే.