English | Telugu
క్రేజీ కాంబో.. కిరణ్ అబ్బవరంకి జోడీగా బిగ్ బాస్ రతిక!
Updated : Oct 11, 2023
బిగ్ బాస్ కి ముందు రతికా రోజ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. నెగటివా, పాజిటివా అనేది పక్కన పెడితే బిగ్ బాస్ వల్ల ఆమె ఎందరికో చేరువైంది. బిగ్ బాస్ హౌస్ లో ఆట తీరు ఆమెకి కాస్త నెగటివ్ ఇమేజ్ తీసుకొచ్చినప్పటికీ, ఆమె అందానికి ఫిదా అయిన యువత కూడా ఉన్నారు. నిజానికి రతిక సినిమా నటి. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వాటిలో కొన్ని విడుదలకు నోచుకోలేదు. కొన్ని విడుదలైనా విజయం సాధించలేదు. కొన్ని సినిమాలలో కీలక పాత్రలు కూడా పోషించింది. అందం, ప్రతిభ ఉన్నప్పటికీ ఆమెకి రావాల్సినంత పేరు రాలేదు. పెద్ద అవకాశాలు కూడా రాలేదు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని ఆమెకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అతను నటించనున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా రతిక ఎంపిక అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల 'రూల్స్ రంజన్' మూవీ ప్రమోషన్స్ సమయంలో ఓ నెటిజన్ "అన్నా నీకు రతిక లాంటి భార్య రావాలి' అనగా.. 'నాపై నీకంత పగ ఎందుకు' అంటూ కిరణ్ సరదాగా రిప్లై ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు కొత్త సినిమా కోసం రతికతో కిరణ్ జోడి కట్టనున్నాడు అనే వార్త ఆసక్తికరంగా మారింది.