English | Telugu

ఇద్దరికీ సూపర్‌హిట్‌ అవసరమే.. అందుకే ఈ ట్విస్ట్‌!

 

సినిమా ఎనౌన్స్‌ చేసిన తర్వాత మెరుపు వేగంతో షూటింగ్‌ కంప్లీట్‌ చేసి అనుకున్న టైమ్‌కి సినిమాను రిలీజ్‌ చేయగల దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ పేరు మొదటగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పూరి చేసిన సినిమాలన్నీ తక్కువ రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేసినవే. ఇప్పుడు పూరికి కూడా ఈ విషయంలో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ తగ్గాయా అనిపిస్తోంది. ఎందుకంటే రామ్‌ హీరోగా స్టార్ట్‌ చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ షూటింగ్‌ ఇంకా జరుగుతూనే ఉంది. రామ్‌, పూరి ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా భారీ విజయాన్ని అందుకుంది. దానికి సీక్వెల్‌గా స్టార్ట్‌ చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రాన్ని మార్చి 8న రిలీజ్‌ చేస్తామని ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పాడు పూరి. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తవుతుందని తెలుస్తోంది. మార్చి 8న సినిమాను రిలీజ్‌ చేద్దామనుకున్నారు. కానీ, షూటింగ్‌ పూర్తయిన తర్వాత రిలీజ్‌కి కొద్ది రోజులే టైమ్‌ ఉండడంతో ముందుగా అనుకున్నట్టు మార్చి 8న రిలీజ్‌ చేయడం సాధ్యపడదు. అందుకే రిలీజ్‌ను మరో రెండు నెలలు వాయిదా వేయబోతున్నారని సమాచారం. 

ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత రామ్‌ హీరోగా వచ్చిన రెడ్‌ చిత్రానికి నెగెటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ ఇస్మార్ట్‌ శంకర్‌ హిట్‌ వల్ల రెడ్‌ చిత్రం కలెక్షన్లపరంగా నిలదొక్కుకుంది. ఆ తర్వాత చేసిన వారియర్‌, స్కంద రామ్‌ కెరీర్‌లో డిసాస్టర్స్‌గా నిలిచాయి. ఇక పూరి జగన్నాథ్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండతో చేసిన లైగర్‌ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకొని అతనికి షాక్‌ ఇచ్చింది. రామ్‌, పూరి ఇద్దరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు కాబట్టి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’పైనే ఆశలు పెట్టుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాని పెద్ద హిట్‌ చెయ్యాలని ఇద్దరూ కష్టపడుతున్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం ఎక్కువ టైమ్‌ తీసుకుంటున్నాడు పూరి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు డబుల్‌ ఇస్మార్ట్‌ మరో రెండు నెలలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ దానికే ఫిక్స్‌ అయ్యారని తెలుస్తోంది.