English | Telugu

‘కల్కి’లో ప్రభాస్‌కి తోడుగా మరో ఇద్దరు స్టార్‌ హీరోలు?

ఒకప్పుడు టాలీవుడ్‌లో రూ.50 కోట్ల సినిమా అంటే చాలా భారీ సినిమాగా చూసేవారు. ఆ తర్వాత అది రూ.100 కోట్లకు పెరిగింది. ఈమధ్యకాలంలో అది అన్‌లిమిటెడ్‌ అయిపోయింది. స్టార్‌ హీరోల సినిమాలను పలు భాషల్లో పాన్‌ ఇండియా సినిమాలుగా రిలీజ్‌ చేస్తున్నారు. అంతేకాదు, ఒక్కో సినిమాను రెండు భాగాలుగా రిలీజ్‌ చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. దానికి తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తూ ప్రపంచ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. 

‘సలార్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ప్రభాస్‌ హీరోగా వస్తున్న సినిమా ‘కల్కి 2898 ఎ.డి.’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాని మే 9న రిలీజ్‌ చెయ్యబోతున్నట్టు సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు. వైజయంతి సంస్థకు మే 9 సెంటిమెంట్‌ ఉంది. అదే డేట్‌కి చిరంజీవి, శ్రీదేవి జంటగా కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా సిల్వర్‌ జూబ్లీ చిత్రంగా నిలిచింది. దాంతో ‘కల్కి’ చిత్రాన్ని కూడా అదే డేట్‌కి రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్‌ అవ్వాల్సి ఉంది. సినిమాకి సంబంధించిన బ్యాలెన్స్‌ పూర్తి కాకపోవడంతో మే 9కి వాయిదా వేశారు. ‘కల్కి’ రెండు భాగాలుగా రిలీజ్‌ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్‌ పార్ట్‌కి సంబంధించిన షూటింగ్‌ వర్క్‌ పూర్తయింది. ఇక సినిమాను రిలీజ్‌ చెయ్యడానికి ఏమేం చెయ్యాలి అనే దానిపై దృష్టి పెట్టాడు నాగ్‌ అశ్విన్‌. ఈ సినిమాకి ఇంటర్నేషనల్‌ లుక్‌ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి భారీ క్యాస్టింగ్‌ ఉంది. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్‌ హీరోలు ఈ సినిమాలో గెస్టులుగా కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ, నాగ్‌ అశ్విన్‌ మధ్య మంచి బాండిరగ్‌ ఉన్న విషయం తెలిసిందే. ఆ కారణంగానే మహానటిలో చిన్న పాత్ర చేశాడు విజయ్‌. అలాగే జాతిరత్నాలు సినిమాలో కూడా కొంతసేపు కనిపించాడు. ఇప్పుడు కల్కిలో విజయ్‌ దేవరకొండ పాత్ర లెంగ్త్‌ కొంచెం ఎక్కువగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలోని విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.