English | Telugu
'సలార్-2'లో అక్కినేని అఖిల్.. అయ్యగారి మాస్ చూస్తారు!
Updated : Jan 18, 2024
అక్కినేని అఖిల్ అదిరిపోయే విజయాన్ని ఎప్పుడు అందుకుంటాడా అని అక్కినేని అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్.. ఆ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో హీరోగా నటించగా.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' పరవాలేదు అనిపించుకోగా, మిగతా నాలుగు సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. దీంతో అఖిల్ కి సాలిడ్ హిట్ ఎప్పుడొస్తుందా అని అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో అఖిల్ 'సలార్ పార్ట్-2'లో నటించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్' ఫ్రాంచైజ్ చేస్తున్నాడు. ఇటీవల మొదటి భాగం విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ లో అఖిల్ నటించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. దానికి కారణం రీసెంట్ గా జరిగిన సలార్ సక్సెస్ పార్టీలో అఖిల్ మెరిశాడు. సలార్ టీంతో పాటు అఖిల్ ఈ పార్టీలో పాల్గొనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే అఖిల్ కూడా సలార్ యూనివర్స్ లో ఉన్నాడని, అందుకే సక్సెస్ పార్టీకి హాజరయ్యాడని ప్రచారం జరుగుతోంది. 'సలార్-2'లో ప్రభాస్ సోదరుడిగా అఖిల్ పరిచయం కానున్నాడని న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే సలార్ లో అఖిల్ భాగమైతే.. తెరపై ప్రభాస్-అఖిల్ కాంబినేషన్ సరికొత్తగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. పైగా సలార్ సక్సెస్ పార్టీలో అఖిల్ లుక్ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.