English | Telugu

‘పుష్ప2’ యూనిట్‌కి ఆ విషయం పెద్ద తలనొప్పిగా మారింది!

టాలీవుడ్‌లో ఏ డైరెక్టర్‌కీ లేని స్పెషాలిటీ సుకుమార్‌కి ఉంది. అదేమిటంటే ఇప్పటివరకు అతను చేసిన సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌ హైలైట్‌గా ఉంటుంది. ఇప్పటివరకు సుకుమార్‌ 8 సినిమాలు డైరెక్ట్‌ చేశాడు. ‘నాన్నకు ప్రేమతో...’లో తప్ప ఏ సినిమాలోనూ అతను ఐటమ్‌ సాంగ్‌ మిస్సవ్వలేదు. అతని ప్రతి సినిమాకీ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఐటమ్‌ సాంగ్‌కి దేవి స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ తీసుకొని దాన్ని ఓ లెవల్‌లో ఉండేలా ప్లాన్‌ చేస్తాడు.

ఇప్పుడిదంతా ఎందుకంటే సుకుమార్‌ రాబోయే సినిమా ‘పుష్ప ది రూల్‌’కి సంబంధించి ఐటమ్‌ సాంగ్‌ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు దర్శకనిర్మాతలు. అతని సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ అంటే ఓ స్టార్‌ హీరోయిన్‌ చెయ్యాలి. ‘పుష్ప’లో సమంత చేసిన ‘ఊ అంటావా.. మావా..’ సాంగ్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఆ పాట సమంతకు కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘పుష్ప2’లోని ఐటమ్‌ సాంగ్‌ కోసం ఇద్దరు బాలీవుడ్‌ హీరోయిన్లను సంప్రదించారని తెలుస్తోంది. అందులో ఒకరు ఐటమ్‌ సాంగ్‌ చెయ్యడానికి తిరస్కరిస్తే.. మరొకరు రెమ్యునరేషన్‌ విషయంలో సంతృప్తి చెందక డ్రాప్‌ అయ్యారు. ఇప్పుడు ఈ ఐటమ్‌ సాంగ్‌ విషయం యూనిట్‌కి పెద్ద తలనొప్పిగా మారింది. మరి సుకుమార్‌ లేటెస్ట్‌ మూవీలో ఐటమ్‌ సాంగ్‌ చేసే అదృష్టం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.