English | Telugu
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి బాలయ్య ఎంట్రీ!
Updated : Nov 15, 2023
'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ టాలీవుడ్ సినీ చరిత్రలోనే మొదటిసారి సినిమాటిక్ యూనివర్స్ కి తెరదీశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఎనిమిది సూపర్ హీరో ఫిల్మ్ లు రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మొదటి సినిమా 'హనుమాన్' 2024 సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే రెండో సినిమాగా 'అధీర'ను ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా భాగం కానున్నారని తెలుస్తోంది.
'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ చిత్రాన్ని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇక త్వరలోనే బాలయ్య డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో చేతులు కలబోతున్నట్లు సమాచారం. నిజానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో ప్రోమోలకు ప్రశాంత్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఆ ప్రోమోలలో బాలయ్యను ప్రశాంత్ ప్రజెంట్ చేసిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ప్రశాంత్ సైతం గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటికే బాలయ్యతో కథ చర్చలు జరిగాయని, ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి రెడీ అని అన్నాడు. తాజాగా బాలకృష్ణ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కావడానికి ఆయన అంగీకరించాడట. ఈ యూనివర్స్ లో భాగంగా వచ్చే మూడు లేదా నాలుగో సినిమాలో నటసింహం నటించే అవకాశముందట. అదే జరిగితే సూపర్ హీరో ఫిల్మ్ లో బాలయ్య ఏ రేంజ్ లో చెలరేగిపోతాడో చూడాలి.