English | Telugu

నిన్న మహేష్‌తో.. రేపు ప్రభాస్‌తో.. ట్రోలింగ్‌ విషయంలో తగ్గేదేలే..!

ప్రస్తుతం సోషల్‌ మీడియా ఎంత పవర్‌ఫుల్‌గా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించి ఏ చిన్న పొరపాటు జరిగినా దానికి బాధ్యులైన వారిపై ట్రోలింగ్‌ చాలా దారుణంగా ఉంటుంది. అంతకుముందు సూపర్‌హిట్‌ సినిమాలు చేసినా.. ఒక్క సినిమాకు తేడా వస్తే వారిని వదిలి పెట్టడం లేదు నెటిజన్లు. ఇటీవలికాలంలో అలా ఎక్కువ ట్రోలింగ్‌కి గురైన వారు తమన్‌. 100కిపైగా సినిమాలకు సంగీతం అందించి ఎన్నో సూపర్‌హిట్‌ పాటలు చేసిన తమన్‌ తాజాగా వచ్చిన ‘గుంటూరు కారం’ చిత్రానికి చేసిన మ్యూజిక్‌ వల్ల ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. నెటిజన్లు అతనితో విపరీతంగా ఆడుకున్నారు. ఈ సినిమా మ్యూజిక్‌ బాగాలేదని, చేసిన పాటల్నే రిపీట్‌ చేశాడని రకరకాలుగా ట్రోల్‌ చేశారు. అయితే ఈ సినిమాలోని ‘కుర్చీని మడతపెట్టి’ పాటతో తమన్‌కి కాస్తో కూస్తో ఊరటనిచ్చారు నెటిజన్లు. 


‘సలార్‌’తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ప్రభాస్‌ తన నెక్స్‌ట్‌ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్‌’ అనే లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. విశేషం ఏమిటంటే మొదటిసారి ప్రభాస్‌ సినిమాకి మ్యూజిక్‌ అందించబోతున్నాడు తమన్‌. ప్రస్తుతం ప్రభాస్‌కి సలార్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్‌ వచ్చిందో మనం చూశాం. దాంతో అతని నెక్స్‌ట్‌ సినిమాకి మ్యూజిక్‌ చేసే అవకాశం వచ్చిన తమన్‌కి ఇప్పుడు టెన్షన్‌ మొదలై ఉంటుంది. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, ఆదిపురుష్‌, రాధేశ్యామ్‌, సలార్‌.. ఈ నాలుగు సినిమాలకు మ్యూజికల్‌గా ఎలాంటి ప్రత్యేకతలు లేవు. ఒకప్పుడు ప్రభాస్‌ సినిమాల్లోని పాటలు ఎంతో పాపులర్‌ అయ్యాయి. కానీ, ఈ నాలుగు సినిమాలు ఆడియో పరంగా చాలా వీక్‌ అయిపోయాయి. అలాంటి టైమ్‌లో ప్రభాస్‌ సినిమా చేసే ఛాన్స్‌ వచ్చింది తమన్‌కి. మరి ఈ సినిమాకైనా తమన్‌ మంచి మ్యూజిక్‌ ఇస్తాడా లేక మహేష్‌కి చేసినట్టుగా ప్రభాస్‌ విషయంలో చేస్తాడా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ‘ది రాజా సాబ్‌’కి ఎట్టి పరిస్థితుల్లోనూ అద్భుతమైన మ్యూజిక్‌ చెయ్యాల్సిన బాధ్యత తమన్‌పై ఉంది. గుంటూరు కారం విషయంలో తమన్‌ని టార్గెట్‌ చేసిన నెటిజన్లు ఇప్పుడు ప్రభాస్‌ సినిమాకి ఎలాంటి పాటలు ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. వారి నుంచి తప్పించుకోవాలంటే ఈ సినిమాకి సూపర్‌హిట్‌ ఆడియో ఇవ్వడం తప్ప తమన్‌కి మరో ఆప్షన్‌ లేదు. లేదంటే మరోసారి తమన్‌కి ట్రోలింగ్‌ తప్పేలా లేదు.