English | Telugu
బాలయ్యతో బోయపాటి.. మళ్ళీ దబిడి దిబిడే!
Updated : Jan 11, 2024
టాలీవుడ్ లో ఉన్న బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబో ఒకటి. వీరి కలయికలో ఇప్పటిదాకా 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి ఘన విజయాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ఒక దానిని మించి ఒకటి విజయం సాధించాయి. దీంతో వీరి కాంబినేషన్ లో నాలుగో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే వీరి కాంబోలో నాలుగో ప్రాజెక్ట్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
'అఖండ' తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో 'అఖండ-2' ఉంటుందని వార్తలొచ్చాయి. బోయపాటి సైతం 'అఖండ-2' చేయనున్నట్లు తెలిపారు. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. 'అఖండ' తర్వాత 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో విజయాలను అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన 109వ (NBK 109) సినిమాని చేస్తున్నాడు. మరోవైపు బోయపాటి 'స్కంద' రూపంలో షాక్ తిన్నాడు. ఆయన తదుపరి సినిమా అల్లు అర్జున్, సూర్య వంటి హీరోలతో ఉండే అవకాశముందని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు బోయపాటి చూపు మళ్ళీ బాలయ్య వైపే మళ్లినట్లు న్యూస్ వినిపిస్తోంది. బాలకృష్ణ సైతం బోయపాటితో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే.. బాలయ్య 110వ సినిమాని బోయపాటే డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ఇది 'అఖండ-2'నా లేక మరో ప్రాజెక్టా అనే దానిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.