English | Telugu

అప్పుడు ప్రభాస్‌కి తప్పలేదు.. ఇప్పుడు మహేష్‌కి తప్పేట్టు లేదు! 

ఎస్‌.ఎస్‌.రాజమౌళి... ఈ పేరు తెలియని సినిమా లవర్‌గానీ,  సినిమా మేకర్స్‌గానీ పపంచంలోనే లేరని చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలతో తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ద్వారా ఆస్కార్‌ అవార్డు తెచ్చిపెట్టి తెలుగు వారి కీర్తికి మరింత వన్నె తెచ్చాడు రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ రిలీజ్‌ అయి సంవత్సరంన్నర అవుతోంది. ఈ సినిమా తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌తో సినిమా చేయనున్నట్టు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్‌ రెడీ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌ ‘గుంటూరు కారం’ షూటింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడో పూర్తయిపోయి రిలీజ్‌ కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ వాయిదా పడుతూ రావడంతో రిలీజ్‌ కూడా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఫైనల్‌గా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాకి తన పూర్తి టైమ్‌ని కేటాయించబోతున్నాడు మహేష్‌. 

మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అంటే క్రేజ్‌ మామూలుగా ఉండదన్న విషయం తెలిసిందే. షూటింగ్‌ ప్రారంభం కాక ముందే ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్‌  సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అదేమిటంటే.. మహేష్‌తో రాజమౌళి చేసే సినిమా రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. దీన్ని రెగ్యులర్‌ సినిమాలా కాకుండా హాలీవుడ్‌ రేంజ్‌లో ఓ అడ్వంచరస్‌ మూవీగా తెరకెక్కించేందుకు రాజమౌళి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తర్వాత మహేష్‌తో సినిమా చేసేందుకు రాజమౌళికి చాలా టైమ్‌ దొరికింది. ఈ గ్యాప్‌లో మహేష్‌ గెటప్‌ గురించి, బ్యాక్‌డ్రాప్‌ గురించి తీవ్రంగా చర్చలు జరిపినట్టు సమాచారం. స్క్రిప్ట్‌ వర్క్‌ మొత్తం విజయేంద్రప్రసాద్‌ పూర్తి చేసారని, దానికి మెరుగులు దిద్దే పనిలోనే ప్రస్తుతం రాజమౌళి ఉన్నాడని తెలుస్తోంది. 

హరిసన్‌ ఫోర్డ్‌తో స్టీవెన్‌ స్పిల్‌బర్గ్‌ చేసిన ఇండియానా జోన్స్‌ సిరీస్‌ గురించి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగాలు ఈ సిరీస్‌లో రిలీజ్‌ అయ్యాయి. ఈ సిరీస్‌లో సినిమాలు దేనికదే ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి ఒక డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకొని ఆఫ్రికా అడవుల్లో ఈ సినిమాను ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. కథపరంగా, సాంకేతికపరంగా హాలీవుడ్‌ రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందించాలని రాజమౌళి చాలా పట్టుదలగా ఉన్నాడు. ఇండియానా జోన్స్‌ సిరీస్‌లాగే ఈ సినిమా కూడా పలు భాగాల్లో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రెండు భాగాలుగా ఈ సినిమాని ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. 

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో రాజమౌళి చేసిన బాహుబలి1, బాహుబలి2 షూటింగ్‌కి ఎంత టైమ్‌  పట్టిందో అందరికీ తెలసిందే. 2013లో ‘మిర్చి’ రిలీజ్‌ అవ్వగానే ‘బాహుబలి’ సెట్స్‌కి వెళ్లిపోయాడు ప్రభాస్‌. ఆ తర్వాత నాలుగేళ్ళు బాహుబలి 1, బాహుబలి 2’ సినిమాలతోనే సరిపోయింది అతనికి. మరో సినిమా చేసే అవకాశం లేదు. ఇప్పుడు మహేష్‌ పరిస్థితి కూడా అంతే అవుతుందని అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. తమ అభిమాన హీరో రాజమౌళితో సినిమా చేస్తున్నారని ఓ పక్క ఆనందిస్తున్న అభిమానులకు ఈ సినిమా రెండు భాగాలు ఉంటుందని తెలియగానే తమ హీరో మరో ఐదారేళ్ళు రాజమౌళి కాంపౌండ్‌లోనే గడపాల్సి వస్తుందని ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. దీన్ని బట్టి ఇప్పట్లో మహేష్‌ని రాజమౌళి వదలడు అనే నిర్ధారణకు వచ్చారు అభిమానులు.
 
బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలు చేసారంటే.. దానికి కారణం లేకపోలేదు. కథలో ఉన్న స్పాన్‌ అటువంటిది కాబట్టి దాన్ని తప్పనిసరిగా రెండు భాగాలుగా రిలీజ్‌ చెయ్యాల్సిందే. మరి మహేష్‌తో చేసే సినిమా విషయంలో కూడా అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అంటే.. ఉంది అనే సమాధానమే చాలామంది నుంచి వస్తోంది. ఎందుకంటే.. ఇది ఇండియానా జోన్స్‌ తరహాలో ఉండే సినిమా అని చెప్పడం వల్ల తప్పకుండా రెండో భాగం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ రాజమౌళి ఆలోచన అదే అయితే.. ఓ నాలుగైదేళ్ళు రాజమౌళి కాంపౌండ్‌లోనే మహేష్‌ బందీగా ఉండక తప్పదు. సినిమా ప్రారంభమై.. రాజమౌళి ఈ సినిమా గురించి నోరు విప్పితే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.