English | Telugu
శివపార్వతులుగా ప్రభాస్, నయనతార!
Updated : Sep 23, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, లేడీ సూపర్ స్టార్ నయనతార 2007 లో వచ్చిన 'యోగి' సినిమాలో కలిసి నటించారు. ఏకంగా పదహారేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరు మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అది కూడా శివపార్వతులుగా కనిపించనున్నారని సమాచారం.
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో ప్రభాస్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన శివుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో పార్వతి పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్లు వినికిడి. ఈ పాత్ర పోషించడానికి నయనతార కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ తరంలో దేవుళ్ళ పాత్రలు పోషించిన అతికొద్ది మంది నటీనటులతో ప్రభాస్, నయనతార ఉన్నారు. 'ఆదిపురుష్'లో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించగా, 'శ్రీరామరాజ్యం'లో సీతగా, 'అమ్మోరు తల్లి'లో అమ్మోరుగా నయనతార మెప్పించారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి శివపార్వతులుగా కనిపించనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.