English | Telugu

కుర్ర దర్శకుడితో ఎన్టీఆర్ పీరియాడికల్ ఫిల్మ్.. హ్యాండిల్ చేయగలడా?..

పాన్ ఇండియా స్టార్స్ గా మారిన తర్వాత కూడా కొందరు హీరోలు యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభాస్ అందరికంటే ముందున్నాడు. ఇప్పటికే సుజీత్ తో 'సాహో', రాధాకృష్ణతో 'రాధేశ్యామ్' చేసిన ప్రభాస్.. దర్శకుడిగా రెండు సినిమాల అనుభవమున్న నాగ్ అశ్విన్ తో భారీ బడ్జెట్ ఫిల్మ్ 'కల్కి 2898 AD' చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా దర్శకుడిగా ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉన్న బుచ్చిబాబుతో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామా చేయనున్నాడు. ఇప్పుడు ఈ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరనున్నాడని తెలుస్తోంది.

అనుభవాన్ని, గత చిత్రాల ఫలితాన్ని పట్టించుకోకుండా కేవలం దర్శకుడి ప్రతిభను నమ్మి అవకాశమిచ్చే హీరోలలో ఎన్టీఆర్ ఒకడు. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా ఎన్టీఆర్ ఇదే స్టైల్ ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్న తారక్.. అనంతరం బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీ కానున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు 'దేవర-2' లైన్ లో ఉన్నాయి. ఇవి పూర్తి కావాలంటే కనీసం రెండుమూడేళ్లు పడుతుంది. అయినప్పటికీ ఎన్టీఆర్ కోసం కథలు సిద్ధం చేసి ఎదురుచూడటానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.

విజయ్ దేవరకొండతో 'టాక్సీవాలా', నానితో 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్న యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్.. తన తదుపరి సినిమాని ఎన్టీఆర్ తో చేయాలన్న ఉద్దేశంతో చాలారోజులుగా కథ రాసుకుంటున్నాడట. ఇదొక పీరియాడికల్ స్టోరీ అని సమాచారం. కథ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, దీనికి ఎన్టీఆర్ లాంటి యాక్టర్ తోడైతే వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఇటీవల ఎన్టీఆర్ ని కలిసి.. రాహుల్ ఈ కథ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథతో తారక్ ఎంతగానో ఇంప్రెస్ అయినప్పటికీ.. ప్రస్తుతం తనకున్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. అయితే డైరెక్టర్ రాహుల్ మాత్రం రెండేళ్లయినా తాను వెయిట్ చేయడానికి సిద్ధమని చెప్పినట్లు వినికిడి. మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సైతం ఎన్టీఆర్ ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి ఆసక్తి చూపిస్తోందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, 'దేవర-2' తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదే అవొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ ని రాహుల్ ఎలా హ్యాండిల్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారుతుంది.