English | Telugu
‘హరిహర వీరమల్లు’ నుంచి క్రిష్ తప్పుకుంటున్నాడా?
Updated : Feb 8, 2024
పవన్‌కల్యాణ్ సినిమాల విషయంలో పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే పూర్తి చెయ్యాల్సిన సినిమాలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రస్తుతం పాలిటిక్స్‌పైనే పవన్ ఫోకస్ పెట్టడంతో ఏ సినిమా పరిస్థితి ఏమిటి అనే విషయంలో సరైన క్లారిటీ లేదు. ముఖ్యంగా ‘హరిహర వీరమల్లు’ చిత్రం విషయంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని మరింత పెంచేలా ప్రమోషన్స్ కూడా చేయాలి. సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ, మేకర్స్ సైడ్ అలాంటివి ఏమీ జరగడం లేదు. సినిమా ఇంత ఆలస్యం కావడానికి ముఖ్య కారణం పవన్ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం. దానితోపాటు కథలో కూడా కొన్ని మార్పులు చేయడం వంటి కారణాలతో డిలే అవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. డైరెక్టర్ క్రిష్‌ని సినిమా నుంచి తప్పిస్తున్నారని, మరో డైరెక్టర్‌కి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన టైమ్‌లోపు షెడ్యూల్ పూర్తి చేయడంలో క్రిష్ ఫెయిల్ అయ్యాడని, సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటివరకు చేసిన షూటింగ్‌కి సంబంధించి పవన్‌కళ్యాణ్ అసంతృప్తిగా వున్నాడని, వాటిని రీ షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవికాక మరికొన్ని కారణాల వల్ల దర్శకుడిని మార్చాలన్న ఆలోచనకు తావిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వినిపిస్తున్న ఈ వార్త నిజమేనా అన్నట్టు యువి క్రియేషన్స్ బేనర్‌లో అనుష్కతో క్రిష్ ఒక సినిమా స్టార్ట్ చేశారని తెలుస్తోంది. దీంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాను ఇక క్రిష్ డైరెక్ట్ చేయకపోవచ్చనే వార్త బలపడుతోంది. వినిపిస్తున్న ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వాలి.