English | Telugu
వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో అనిల్ రావిపూడి సినిమా.. ఇది అదేనా?
Updated : Feb 5, 2024
వెంకటేష్, వరుణ్‌తేజ్, అనిల్ రావిపూడి, దిల్‌రాజు.. ఈ కాంబినేషన్ వినగానే ఇది ‘ఎఫ్2’ కాంబినేషన్ అని ఎవరికైనా అర్థమైపోతుంది. మళ్ళీ వీళ్ళంతా కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్2’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ ‘ఎఫ్3’ చేశారు. కానీ, అది డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణతో అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ను రూపొందించారు.
ప్రస్తుతం ‘ఎఫ్2’ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ‘ఎఫ్3’కి సీక్వెల్ కాదని అంటున్నారు. పూర్తిగా భిన్నమైన కథతో వెంకటేష్, వరుణ్‌తో సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి కూడా దిల్‌రాజే నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఇటీవల వెంకటేష్ హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సైంధవ్’ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే వరుణ్‌తేజ్‌కి కూడా ఈమధ్యకాలంలో హిట్ లేదు. హిట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. వెంకటేష్, వరుణ్‌తేజ్‌లకు మరో హిట్ ఇస్తాడని ఆశిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియోను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారని సమాచారం.