English | Telugu
ఎన్టీఆర్, నాని మల్టీస్టారర్.. ఈ పిక్ దానికి సంకేతమా?
Updated : Dec 5, 2023
యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని.. ఇద్దరిదీ విభిన్నమైన ఇమేజ్, వీరు ఎంచుకునే కథలు, దర్శకులు పూర్తిగా డిఫరెంట్. అయితే ఇద్దరూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నవారే. తమ నటనతో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చెయ్యడంలో ఇద్దరిదీ అందె వేసిన చెయ్యే. అయితే ఎన్టీఆర్ చేసే భారీ సినిమాల వల్ల దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. నాని విషయానికి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ చేసే సినిమాల వల్ల అతను నేచురల్ స్టార్ అయ్యాడు. ఇలాంటి ఇద్దరు హీరోలు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? అలా వారిద్దరినీ చూడాలనుకున్నాడు ఓ అభిమాని. ఆ అభిమాని కోరికను నెరవేర్చాడు నాని. ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోని ‘ఎక్స్’ వేదికగా నాని షేర్ చేశాడు. ఆప్యాయంగా ఒకరినొకరు హత్తుకుని కనిపించిన ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ నివాసంలో జరిగిన ఓ పార్టీలో ఇలా నానితో కలిసి దిగిన ఫోటో ఇది. ఇప్పుడు ఆ అభిమాని కోరిక మేరకు సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
అయితే సోషల్ మీడియాలో ఈ ఫోటోను చూసిన కొందరు ఇలా ఫోటోను షేర్ చేయడం వెనుక మరో కారణం కూడా ఉండి ఉండొచ్చు అంటున్నారు. అదేమిటంటే ఎన్టీఆర్, నాని కలిసి ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని, దానికి లీడ్‌గానే ఈ ఫోటోను షేర్ చేసారనే మాట కూడా వినిపిస్తోంది. దీనిపై స్పందిస్తున్న కొందరు.. వాస్తవానికి ఎన్టీఆర్, నాని కాంబినేషన్‌లో సినిమా అంటే మామూలుగా ఉండదని, అది ఒక పూర్తిస్థాయి సినిమా అవుతుందని భావిస్తున్నారు. మంచి కథ, ఇద్దరినీ బ్యాలెన్స్ చేసే దర్శకుడు ఉంటే తప్పకుండా అది మంచి మల్టీస్టారర్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలీదుగానీ.. ఎన్టీఆర్, నాని అభిమానులు మాత్రం తమ మనసులో ఉన్నది చెబుతున్నారు.