English | Telugu
'కన్నప్ప'లో బాలయ్య.. ఊ కొడతారా ఉలిక్కిపడతారా..?
Updated : Feb 27, 2024
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప'. మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు స్టార్లు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. వారిలో ప్రభాస్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి బిగ్ స్టార్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్టులో నందమూరి బాలకృష్ణ కూడా చేరారనే వార్త ఆసక్తికరంగా మారింది.
మంచు ఫ్యామిలీతో బాలకృష్ణకు మంచి అనుబంధం ఉంది. అందుకే 'కన్నప్ప'లో ఒక ముఖ్య పాత్ర కోసం విష్ణు సంప్రదించడంతో.. ఆ పాత్ర చేయడానికి బాలయ్య అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బాలయ్య ఓకే చెప్పినప్పటికీ.. ఆయన కన్నప్ప షూటింగ్ లో పాల్గొనాలంటే చాలా సమయం పట్టే అవకాశముంది. ఎందుకంటే ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు మూడు నెలలపాటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఎన్నికలు ముగిశాక, 'NBK 109' షూటింగ్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా.. 'కన్నప్ప' కోసం బాలయ్య కొద్దిరోజులు కేటాయించాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా విష్ణు.. ఆ పాత్రని బాలకృష్ణతోనే చేయించాలని పట్టుబట్టి మరీ ఎదురుచూడటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మోహన్ బాబుతో కలిసి గతంలో పలు సినిమాల్లో స్క్రీన్ పంచుకున్నారు బాలకృష్ణ. అలాగే మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ నటించిన "ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా'' సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించారు. అందులో బాలకృష్ణ పోషించిన రుద్రమనేని నరసింహ రాయుడు పాత్ర మెప్పించినప్పటికీ.. సినిమా మాత్రం పరాజయం పాలైంది. ఈ క్రమంలో అసలే వరుస ఫ్లాప్స్ లో ఉండి, హిట్ కోసం ఎంతగానో పరితపిస్తున్న మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారనే వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది.
అయితే 'కన్నప్ప' సినిమాతో 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా' నెగటివ్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య పీక్ ఫామ్ లో ఉన్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తో ఆయన ఫుల్ జోష్ లో ఉన్నారు. బాలకృష్ణ ఉంటే సినిమా హిట్టే అనేంతలా ప్రస్తుతం ఆయన టైం నడుస్తుంది. అలాంటి బాలయ్య లక్ తోడై.. 'కన్నప్ప'తో విష్ణు హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.