English | Telugu
అల్లు అరవింద్ సంచలన నిర్ణయం.. భారీ నష్టాలే కారణమా?
Updated : Feb 28, 2024
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తుంటారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. ఇప్పటికే ఆ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. భవిష్యత్ అంతా ఓటీటీదే అని ఆలోచించి ప్రత్యేకంగా తెలుగులో మొదటి ఓటీటీ వేదికను ప్రారంభించిన ఘనత ఆయనకే సొంతం. 2020లో మై హోమ్ గ్రూప్ తో కలిసి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాను ప్రారంభించారు అల్లు అరవింద్. సినిమాలు, సిరీస్ లు, షోలతో తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు బాగానే చేరువైంది ఆహా. అయితే ఇప్పుడు ఈ ఓటీటీ వేదిక విషయంలో మెగా ప్రొడ్యూసర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఆహాని ప్రారంభించి నాలుగేళ్లే అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఓటీటీ వేదికను అమ్మేయాలని అల్లు అరవింద్, మై హోమ్ గ్రూప్ నిర్ణయించుకున్నారట. దానికి కారణం భారీ నష్టాలే అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఓటీటీ రైట్స్ కోసం సినిమా రేంజ్ ని బట్టి రూ.10 కోట్ల నుంచి రూ.100 కోట్ల దాకా చెల్లించాల్సి వస్తుంది. నేషనల్, ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హీరో రేంజ్, సినిమా రేంజ్ ని బట్టి భారీ మొత్తం చెల్లించి రైట్స్ తీసుకోవడానికి వెనకాడటం లేదు. కానీ ఆహా పరిస్థితి అలా కాదు. వాటితో పోలిస్తే సబ్‌స్క్రిప్షన్ చాలా ధర తక్కువ ఉంటుంది. ఆహా మొదటి నుంచి కూడా రిస్క్ తీసుకోకుండా.. ఎక్కువగా తమ కాంపౌండ్ కి చెందిన సినిమాలనో లేక తక్కువ మొత్తానికి దొరికే చిన్న సినిమాలనో తీసుకోవడం చేస్తుంది. అయితే అలా రిస్క్ తీసుకోకపోవడం వల్లనే మిగతా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లాగా ఆహా లాభాలు చూడలేకపోతుంది అంటున్నారు. లాభాల కోసం సబ్‌స్క్రిప్షన్ ధర పెంచుదామంటే.. పెద్ద సినిమాల రైట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అలా పెద్ద సినిమాల రైట్స్ దక్కించుకోవాలంటే వందల కోట్లతో రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఇది అనుకున్నంత తేలికైన విషయం కాదు. అందుకే ఆహాని అమ్మేయాలనే నిర్ణయానికి అల్లు అరవింద్, మై హోమ్ గ్రూప్ వచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే రెండు ప్రముఖ సంస్థలతో అమ్మకానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లు వినికిడి.