English | Telugu
మహేష్-రాజమౌళి సినిమాలో నాగార్జున..!
Updated : Feb 3, 2024
కేవలం ప్రకటనతోనే సినిమాపై అంచనాలను పెంచగల దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ సక్సెస్ అందుకున్న ఆయన తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్నాడు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ అడ్వెంచర్ రూపొందనుంది. ఈ మూవీతో 'బాహుబలి-2' రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను రాజమౌళి రంగంలోకి దింపబోతున్నాడట. అంతేకాదు, అక్కినేని నాగార్జున కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.
ఇతర భాషల సినిమాలలోనూ, ఇతర హీరోల సినిమాలలోనూ కీలక పాత్రలు పోషించడానికి నాగార్జున ఎప్పుడూ వెనుకాడడు. ఇప్పటికే అలా ఆయన పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం తమిళ హీరో ధనుష్ తోనూ శేఖర్ కమ్ముల సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అలాంటి నాగార్జునను రాజమౌళి 'SSMB 29'లో కథకి ఎంతో కీలకమైన పాత్ర కోసం రంగంలోకి దింపుతున్నాడట. అదే నిజమైతే తెలుగునాట ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి అనడంలో సందేహం లేదు.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. నాగార్జున ఇప్పటిదాకా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయనప్పటికీ.. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఆయన నటించిన 'రాజన్న' సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు జక్కన్న ఆధ్వర్యంలోనే తెరకెక్కాయి. అప్పటినుంచే రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయాలని నాగ్ ఆశ పడుతుండగా, 'SSMB 29' రూపంలో అది నెరవేరబోతుందని అంటున్నారు.
ఇక మహేష్ బాబు, ఇప్పటికే సీనియర్ స్టార్స్ లో ఒకరైన వెంకటేష్ తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోగా.. ఇప్పుడు నాగార్జునతో కలిసి నటించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.