English | Telugu
బాలయ్య సినిమా కోసం పోటీ పడుతున్న స్టార్స్..!
Updated : Feb 4, 2024
ఈ ఓటీటీ యుగంలో అన్ని భాషల సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో రీమేక్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. అయినప్పటికీ కొందరు స్టార్స్ మాత్రం రీమేక్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గత చిత్రం 'భగవంత్ కేసరి'ని రీమేక్ చేయడానికి పలువురు స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'భగవంత్ కేసరి'. గతేడాది దసరాకు విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో మంచి సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో ప్రేక్షకుల మెప్పు పొందింది. అందుకే ఈ సినిమా రీమేక్ చేయాలని ఇతర భాషలకు చెందిన కొందరు స్టార్స్ చూస్తున్నారు.
తమిళ స్టార్ దళపతి త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి.. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్నాడు. తాను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేముందు చివరి సినిమాగా 'భగవంత్ కేసరి' రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట. రజినీకాంత్ కి సైతం ఈ సినిమాపై మనసు మళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు త్వరలోనే తమిళ్ లో 'భగవంత్ కేసరి' రీమేక్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇక శివ రాజ్ కుమార్ సైతం కన్నడలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.