Read more!

English | Telugu

ప్రభాస్ 'కల్కి'లో పరశురాముడిగా ఎన్టీఆర్.. ఘట్టమేదైనా, పాత్ర ఏదైనా నేను రెడీ..!

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'కల్కి 2898 AD'(Kalki 2898 AD) సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటితో పాటు దర్శకుడు రాజమౌళి అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో నాని కృపాచార్యుడి పాత్రలో కనిపించనున్నాడని ఇటీవల న్యూస్ వినిపించింది. అయితే వీటన్నింటిని మించి 'కల్కి'లో బిగ్ సర్ ప్రైజ్ ఉందట. అదేంటంటే ఈ సినిమాలో పరశురాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) కనిపించనున్నాడట.

'కల్కి'లో ప్రభాస్(Prabhas) టైటిల్ రోల్ పోషిస్తుండగా.. 'అశ్వత్థామ'గా అమితాబ్ బచ్చన్, 'కలి'గా కమల్ హాసన్ కనిపించనున్నారు. కృపాచార్యుడిగా నాని కనిపించనున్నాడని వినికిడి. అశ్వత్థామ, కృపాచార్యుడితో పాటు.. సప్త చిరంజీవులు అయినటువంటి హనుమంతుడు, పరశురాముడు వంటి మిగతా పాత్రలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు పరశురాముడు పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

నందమూరి కుటుంబం పౌరాణిక పాత్రలు పోషించడంలో దిట్ట. తారక్ కూడా 'యమదొంగ'లో యంగ్ యమగా తనదైన నటనతో కట్టిపడేశాడు. సరైన పాత్ర పడితే దానిని తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లగల నటుడిగా ఎన్టీఆర్ కి పేరుంది. అలాంటి నటుడు పరశురాముడి పాత్రలో కనిపిస్తే అదిరిపోతుంది అనడంలో లేదు. పైగా పరశురాముడి పాత్ర పతాక సన్నివేశాలలో ఉంటుందట. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ నిలవనుందని చెబుతున్నారు. తెర మీద ఒకవైపు కల్కిగా ప్రభాస్, మరోవైపు పరశురాముడిగా ఎన్టీఆర్ కనిపిస్తే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవేమో.