English | Telugu

మెహర్ రమేష్ కొత్త సినిమా.. ఎవరితోనో తెలుసా?

సినీ రంగంలో జయాపజయాలు సహజం. కానీ టాలీవుడ్ లో దర్శకుడు మెహర్ రమేష్ పరిస్థితి భిన్నం. ఇప్పటిదాకా తెలుగులో ఆయనకు ఒక్కటీ సరైన విజయం దక్కలేదు. ఆయన గత మూడు చిత్రాలైతే ఒక దానిని మించి ఒకటి ఘోర పరాజయాలుగా మిగిలాయి. అయినప్పటికీ మెహర్ రమేష్ కి కొత్త అవకాశాలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.

తెలుగులో 'కంత్రి'తో దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన మెహర్.. మొదటి సినిమాతోనే పరాజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'బిల్లా' పరవాలేదు అనిపించుకున్నప్పటికీ.. 'శక్తి', 'షాడో' డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ దెబ్బకి తొమ్మిదేళ్లు మెగాఫోన్ కి దూరమైన మెహర్.. ఆలస్యంగానైనా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో 'భోళా శంకర్' చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమాతోనైనా మెహర్ హిట్ మొహం చూస్తాడు అనుకుంటే.. మెగాస్టార్ కి బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అందించాడు.

ఇలా వరుసగా మూడు డిజాస్టర్స్ ఇచ్చిన మెహర్ కి.. ఇక కొత్త సినిమా అవకాశం రావడం కష్టమేనని భావించారంతా. కానీ టాలీవుడ్ కి చెందిన ఒక బడా నిర్మాణ సంస్థ మాత్రం మెహర్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చిందట. అయితే ఒక కండిషన్ పెట్టిందట. అదేంటంటే తక్కువ బడ్జెట్ లో రూ.5 కోట్ల లోపులో కొత్త వాళ్ళతో సినిమా చేయాలి. ఇప్పటిదాకా స్టార్ హీరోలతో భారీ సినిమాలు చేసి నిర్మాతల చేతులు కాల్చిన మెహర్.. ఈ లో బడ్జెట్ సినిమాతోనైనా విజయాన్ని అందుకొని, నిర్మాతల కళ్ళలో ఆనందాన్ని నింపుతాడేమో చూడాలి.