English | Telugu

వెబ్‌ సిరీస్‌కి ఓకే చెప్పిన మెగాస్టార్‌.. ఇది నిజమేనా?

ఒకప్పుడు థియేటర్లకే పరిమితమైన వినోదం.. ఇప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా అందుబాటులోకి వచ్చింది. వాటిలో ఓటీటీకి ప్రాధాన్యం పెరిగింది. ఓటీటీ అనేది వరల్డ్‌వైడ్‌గా విస్తరించి ఉండడంతో అందులో ఎంట్రీ ఇవ్వడం వల్ల హీరోలు, హీరోయిన్ల పాపులారిటీ మరింత పెరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే స్టార్‌ హీరోలు, స్టార్‌ హీరోయిన్లు సైతం ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలికాలంలో హీరోయిన్లు ఓటీటీల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పుడు హీరోలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓటీటీలోకి వస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవితో ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా సరైన కథ ఉంటే ఓటీటీలోకి రావడానికి తనకు అభ్యంతరం లేదని తెలిపారు. అప్పటి నుంచి అలాంటి న్యూస్‌ కోసం మెగాభిమానులు ఎదురుచూస్తున్నారు. 

ఓటీటీ సంస్థల్లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు ఇటీవల హైదరాబాద్‌ వచ్చి టాలీవుడ్‌ ప్రముఖులను కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి, మహేష్‌, ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలతో నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. అసలు ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌ ఎందుకు వచ్చారనే చర్చ కూడా ఆమధ్య జరిగింది. ఆ సమయంలో చిరంజీవితో ఓ వెబ్‌ సిరీస్‌ చేసేందుకు ఆ సంస్థ ఒప్పందం చేసుకుందన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. త్వరలోనే చిరంజీవి ఓటీటీలోకి రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోపక్క ఇది రూమర్‌ మాత్రమేనని, చిరంజీవికి అలాంటి ఆఫర్‌ ఏదీ రాలేదని తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని చెబుతున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌. రూ.100 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై మెగాస్టార్‌ ఎన్నో హోప్స్‌ పెట్టుకున్నారు. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రావాలన్న ఆలోచనతోనే ఉన్నారని, ప్రస్తుతానికి ఓటీటీలోకి వచ్చే ఆలోచన చేయడం లేదని సమాచారం.