English | Telugu
'హనుమాన్'లో హనుమంతుడిగా చిరంజీవి!
Updated : Jul 4, 2023
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న సినిమాలలో 'హనుమాన్' ఒకటి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ఇది. 'జాంబీ రెడ్డి' తరువాత తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ చిత్రాలను మించేలా విజువల్స్ ఉన్నాయనే ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది.
హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల తరహాలో మన పురాణాల నుంచి శక్తివంతమైన పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని సూపర్ హీరోస్ సినిమాటిక్ యూనివర్స్ కి శ్రీకారం చుట్టారు ప్రశాంత్ వర్మ. ఈ యూనివర్స్ లో భాగంగా మొదట 'హనుమాన్' రానుంది. ఒక సాధారణ యువకుడు హనుమంతుడిలా శక్తివంతుడు ఎలా అయ్యాడనేది ఇందులో చూపించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్ లో కొన్ని నిమిషాల పాటు హనుమంతుడు దర్శనమిస్తారట. అయితే హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవిని రంగంలోకి దింపడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోందట. చిరంజీవికి హనుమంతుడు అంటే ఎంతో అభిమానం. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రంలో ఆయన హనుమంతుడిగా కనిపించారు. అలాగే 'హనుమాన్' అనే బాలల యానిమేషన్ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. చిరంజీవి స్టార్డమ్ ని, హనుమంతుడి పట్ల ఆయనకున్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని.. హనుమంతుడి పాత్ర ఆయన చేత చేయిస్తే బాగుంటుందని చిత్రం బృందం భావిస్తోందట. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం 'హనుమాన్'పై అంచనాలు రెట్టింపు అవుతాయి అనడంలో సందేహం లేదు.