English | Telugu

శ్రీలీల ప్లేస్ లో మీనాక్షి.. మామూలుగా ఉండదు..!

విజయ్ దేవరకొండ తన 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో శ్రీలీలకు బదులుగా మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

విజయ్ తన 13వ సినిమాగా ప్రకటించిన 'ఫ్యామిలీ స్టార్'ని ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించుకోవడంతో.. 'VD 12' షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఈ గ్యాప్ లో దర్శకుడు గౌతమ్ 'మ్యాజిక్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు 'VD 12' విషయంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా డేట్స్ ఇష్యూ కారణంగా పలువురు నటీనటులు మారిపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆమె స్థానంలో మేకర్స్ మీనాక్షిని హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం.

కాగా ఇటీవల విడుదలైన 'గుంటూరు కారం' సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కలిసి నటించారు. అందులో శ్రీలీల హీరోయిన్ కాగా, పెద్దగా ప్రాధాన్యత లేని సెకండ్ హీరోయిన్ పాత్రలో మీనాక్షి కనిపించింది. అలాంటిది ఇప్పుడు విజయ్ సినిమా కోసం హీరోయిన్ గా శ్రీలీల స్థానంలో తాను ఛాన్స్ కొట్టేయడం ఆసక్తికరంగా మారింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మీనాక్షికి యూత్ లో మంచి ఫాలోయింగే ఉంది. ఆమెకి సరైన సినిమాలు పడితే ఎక్కడికో వెళ్ళిపోతుందని బలంగా నమ్మేవాళ్ళు ఎందరో ఉన్నారు.