English | Telugu

అత్తారింటికి దారేది.. ఆ ప్రయత్నంలోనే ఉన్న తమన్నా!

బాలీవుడ్‌ నుంచి వచ్చి టాలీవుడ్‌లో సెటిల్‌ అయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. వారిలో 30 సంవత్సరాలు దాటినా ఇంకా పెళ్లి ఊసు ఎత్తనివారు కూడా ఉన్నారు. అయితే కొందరు మాత్రం తమ లైఫ్‌ పార్టనర్‌ని ముందుగానే సెలెక్ట్‌ చేసుకొని ఏళ్ళ తరబడి వారితో డేటింగ్‌లో ఉంటున్నారు తప్ప పెళ్లి అనే మాట వారి నోటి నుంచి రావడం లేదు. హీరోయిన్లకు పెళ్లి అయిపోతే దాని ప్రభావం కెరీర్‌ మీద పడే అవకాశం ఉండనే ఉంది. ఆ కారణంతోనే పెళ్లి చేసుకోవడం తప్ప మిగతా విషయాల్లో భార్యాభర్తల్లాగే వ్యవహరిస్తున్నారన్నది అందరినోటా వినిపిస్తున్న మాట. 

అయితే తాజాగా తమన్నా భాటియా పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే తమన్నా సడన్‌గా ఒక డివోటీగా దర్శనమిచ్చింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కంటే ఆమెకు సౌత్‌లోగానీ, నార్త్‌లోగానీ అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం. కెరీర్‌ ఎలాగూ ముగింపు దశకు చేరుకుంది కాబట్టి ఇక పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయానికి తమన్నా వచ్చిందని సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. బాలీవుడ్‌ నటుడు విజయ్‌వర్మతో చాలా కాలంగా తమన్నా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా ప్రకటించింది కూడా. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంచింది. 

ఇదిలా ఉంటే.. తమన్నా పరమ భక్తురాలిగా మారిపోయిందని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఫుల్‌ బిజీగా ఉంది. అందులో భాగంగానే ఇటీవల గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని తన తల్లిదండ్రులతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఇవన్నీ తన పెళ్లి కోసమేనని, త్వరలోనే ఆ తీపికబురు తమన్నా తెలియజేయబోతోందని సమాచారం.