English | Telugu

'రాజా సాబ్' తర్వాత మరో పాన్ ఇండియా స్టార్ తో మారుతి మూవీ..!

యువ హీరోలతో కామెడీ ఎంటర్టైనర్స్ చేసి మంచి విజయాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మారుతి. ఇప్పటిదాకా ఆయన డైరెక్షన్ లో పది సినిమాలు వస్తే అందులో ఒక్క 'బాబు బంగారం' మాత్రమే సీనియర్ స్టార్ వెంకటేష్ తో చేశాడు. ఆ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో మారుతి.. స్టార్స్ ని హ్యాండిల్ చేయలేడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ మారుతికి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ఆయన 'ది రాజా సాబ్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ రొమాంటిక్ హారర్ ఫిల్మ్ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే దీని తర్వాత కూడా మారుతి వరుసగా పాన్ ఇండియా స్టార్స్ తోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట.

ఓ వైపు 'ది రాజా సాబ్' చిత్రాన్ని రూపొందిస్తూనే మరోవైపు తన రైటింగ్ టీంతో కలిసి రామ్ చరణ్ కోసం, అల్లు అర్జున్ కోసం కథలు సిద్ధం చేయిస్తున్నాడట మారుతి. వీటిలో రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఓకే అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు. ప్రస్తుతం చరణ్ చేతిలో 'గేమ్ ఛేంజర్'తో పాటు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న ఓ సినిమా ఉంది. 'ది రాజా సాబ్' రిలీజ్ అయ్యే టైంకి ఈ రెండు సినిమాలను చరణ్ పూర్తి చేసే అవకాశముంది. పైగా చరణ్ ఇంకా ఇతర ప్రాజెక్ట్స్ ఏవీ కమిట్ అవ్వలేదు. దానికి తోడు మారుతితో సినిమా చేస్తానని గతంలో చిరంజీవి మాట ఇచ్చాడు. చిరు ఇచ్చిన మాట కోసమైనా తన తండ్రికి బదులుగా చరణ్.. మారుతి మూవీ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.