English | Telugu

షూటింగ్స్‌ని పక్కన పెట్టబోతున్న ప్రభాస్‌.. ఎందుకో తెలుసా?

కొందరు హీరోలు ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉంటారు. విరామం అనేది లేకుండా షూటింగ్స్‌ చేయడంలోనే వారు ఎంజాయ్‌మెంట్‌ని వెతుక్కుంటారు. కానీ, కొందరు మాత్రం ఒక సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్‌ తీసుకొని ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌కి వెళుతుంటారు. కానీ, రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కి ఆ అవకాశం లేదు. ఎందుకంటే అతనికా బ్యాచ్‌లరే కాబట్టి అలాంటి ఆలోచన చేసే అవకాశం లేదు. అందుకే ‘బాహుబలి’ నుంచి ‘సలార్‌’ వరకు ఎప్పుడూ షూటింగుల్లోనే గడిపాడు ప్రభాస్‌. 

‘బాహుబలి’ కోసం నాలుగేళ్ళు కష్టపడ్డాడు. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, సలార్‌.. ఇలా వరసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీ అయిపోయాడు. సలార్‌ రిలీజ్‌ తర్వాత ఇప్పుడు కల్కి, రాజా సాబ్‌ చిత్రాల షూటింగ్స్‌లో ఉంటున్నాడు. ఈ పదేళ్ళలో షూటింగ్‌ నుంచి ప్రభాస్‌కి విశ్రాంతి దొరికింది చాలా తక్కువే. అప్పుడప్పుడు షెడ్యూల్‌కి షెడ్యూల్‌కి మధ్య వచ్చే గ్యాప్‌ తప్ప లాంగ్‌ గ్యాప్‌ అనేది ఎప్పుడూ లేదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభాస్‌ ఓ నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. 

ఆమధ్య మోకాలికి తగిలిన గాయానికి సంబంధించిన శస్త్ర చికిత్స కోసం విదేశాలకు వెళ్ళాడు ప్రభాస్‌. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్లీ షూటింగ్స్‌లో బిజీ అయిపోయాడు. ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవాలని ప్రభాస్‌ నిర్ణయించుకున్నాడని సమాచారం. ‘కల్కి’ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తి కాగానే కొన్నాళ్ళు షూటింగ్స్‌కి బ్రేక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. అది కూడా లాంగ్‌ గ్యాప్‌ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నిజానిజాలు ఏమిటి అనేది తెలియాలంటే స్వయంగా లాంగ్‌ లీవ్‌ గురించి ప్రభాస్‌ చేసే ప్రకటన కోసం వెయిట్‌ చెయ్యక తప్పదు.