English | Telugu
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మనోజ్ నటిస్తున్నాడా.. క్లారిటీ వచ్చేసింది!
Updated : Dec 9, 2023
హీరోలైనా, హీరోయిన్‌లైనా.. వారు ఎన్ని సినిమాల్లో నటించినా, ఎంత పేరు తెచ్చుకున్నా వారికంటూ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. తమ అభిరుచికి అనుగుణంగా ఉండే అలాంటి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంటారు. కొంతమందికి తమ ప్రమేయం లేకుండానే ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వస్తుంది. మరికొందరు మాత్రం తమ కలను నెరవేర్చుకునేందుకు తామే రంగంలోకి దిగి ఆ సినిమాను నిర్మించడానికి పూనుకుంటారు. అలాంటి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు హీరో మంచు విష్ణు నడుం కట్టాడు.
హీరో మంచు విష్ణు చాలా సందర్భాల్లో తనకు భక్త కన్నప్ప కథాంశంతో సినిమా చెయ్యాలని ఉందని చెప్పాడు. అది తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపాడు. ఈ సినిమా కోసం తనికెళ్ళ భరణితో చాలా సంవత్సరాల పాటు చర్చలు జరిపాడు. అయితే అనూహ్యంగా ఈ సినిమా తనికెళ్ళ భరణి చేజారి పోయింది. ‘కన్నప్ప’ పేరుతో మంచు విష్ణు ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు పాన్ ఇండియా మూవీ లుక్ తెచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. తన కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో ‘కన్నప్ప’ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు విష్ణు. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించాడు.
ఈ సినిమాలో స్టార్ హీరోలను భాగస్వామ్యం చెయ్యడం ద్వారా మంచి బజ్ వస్తుందని భావిస్తున్న విష్ణు కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రభాస్, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారనగానే ఆటోమేటిక్‌గా పాన్ ఇండియా మూవీ లుక్ వచ్చేసింది. వాళ్ళు కనిపించేది కొన్ని నిమిషాలే అయినా సినిమాకి కావాల్సినంత హైప్ వస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేసిన విష్ణు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనే విషయం మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.
ఇదిలా ఉంటే.. ‘కన్నప్ప’ చిత్రంలో మంచు మనోజ్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చగా మారింది. మనోజ్ ఏమిటి? కన్నప్పలో నటించడం ఏమిటి? ఇది జరిగే పనేనా అంటూ అందరూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఈ విషయంలో అందరూ ఆశ్చర్యపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ఉన్నాయని ఆ మధ్య మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే గొడవకు సంబంధించిన ఒక వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. కానీ, అది నిజమైన వీడియో కాదని సర్ది చెప్పుకున్నారు. అసలు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఉన్నాయా? ఉంటే అవి ఎలాంటివి అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మంచు మనోజ్ పేరు వార్తల్లోకి వస్తోంది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’లో మనోజ్ నటించబోతున్నాడనేదే ఆ వార్త. ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కన్నప్ప సినిమాలో నటించే విషయం ఎప్పుడు మనోజ్ దగ్గరకు రాలేదని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఈ వార్తలో నిజంలేదని స్పష్టం చేస్తున్నారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మనోజ్ కెమెరా ముందుకు వచ్చాడు. ఒక సినిమాలో నటిస్తూనే ‘ఉస్తాద్’ అనే గేమ్ షోకి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈటీవల విన్ యాప్ ద్వారా ఈ గేమ్ షో స్ట్రీమ్ అవనుంది. అయితే విష్ణు కన్నప్పతో మనోజ్‌కి ఎలాంటి సంబంధం లేదని సమాచారం. అయితే మనోజ్ కూడా ఈ సినిమాలో చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అన్నదమ్ముల మధ్య గొడవలు అంటే అవి ఎన్నిరోజులు ఉంటాయిలే అంటూ కొట్టిపారేస్తున్నారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు.. ఏదో ఒక సందర్భంలో కన్నప్ప సినిమా మనోజ్ దృష్టికి వెళ్లి ఉంటుంది. అందుకే కన్నప్ప చిత్రంలో మనోజ్ నటించనున్నాడనే వార్త బయటికి వచ్చింది.