English | Telugu

ప్రశాంత్‌ నీల్‌ ‘కెజిఎఫ్‌3’ నుంచి తప్పుకుంటున్నాడా.. కారణమేంటి?

ఎన్నో నెలల నిరీక్షణ తర్వాత ‘సలార్‌’ డిసెంబర్‌ 22న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ను ఆల్రెడీ మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ తర్వాత చేయబోయే సినిమాల గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తను చేయబోయే సినిమాలకు గురించి కొన్ని సంకేతాలు ఇస్తున్నాడు ప్రశాంత్‌. కెజిఎఫ్‌ 3 స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉందని, అయితే ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్‌ చేసేది ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నాడు. మరో పక్క గీతూ మోహన్‌దాస్‌తో హీరో యశ్‌ చేయబోయే సినిమాకి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇది యశ్‌ చేయబోతున్న 19వ సినిమా. అయితే కెజిఎఫ్‌ 3 యశ్‌ 20వ సినిమా కానుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా స్టార్ట్‌ చెయ్యాలంటే ప్రశాంత్‌కి ఎన్నో కమిట్‌మెంట్స్‌ ఉన్న కారణంగా అది అంత సులభం కాదని అర్థమవుతోంది. 

 

దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చెయ్యాలి. ఈ సినిమాను 2024లో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ రెడీగా ఉంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చేస్తున్న ‘దేవర’ పూర్తయిన తర్వాత బాలీవుడ్‌ మూవీ ‘వార్‌2’ షూటింగ్‌లో పాల్గొంటాడు. ఆ సినిమా షూటింగ్‌ జరిగే డేట్స్‌ని బట్టి ప్రశాంత్‌ నీల్‌ సినిమా కూడా ఒకే సమయంలో షూటింగ్‌ జరుగుతుంది. ఈ సినిమా పూర్తి కావడానికి చాలా టైమ్‌ పట్టే అవకాశం ఉంది. ఇక రామ్‌చరణ్‌తో ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సలార్‌ 2 పూర్తి చెయ్యాల్సిన బాధ్యత కూడా ప్రశాంత్‌పై ఉంది. ఇన్ని కమిట్‌మెంట్స్‌ మధ్య కెజిఎఫ్‌3ని పూర్తి చెయ్యడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇదిలా ఉంటే కెజిఎఫ్‌3 చిత్రాన్ని తన శిష్యులు పూర్తి చేసే అవకాశం కూడా ఉందని ఇంతకుముందే హింట్‌ ఇచ్చాడు ప్రశాంత్‌. అదే జరిగితే కెజిఎఫ్‌ 1, 2 చిత్రాల ఫ్లేవర్‌ మిస్‌ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తన ముందున్న కమిట్‌మెంట్స్‌ కారణంగానే కెజిఎఫ్‌3ని తెరకెక్కించే బాధ్యత నుంచి తప్పుకుంటున్నాడా.. లేక వేరే కారణం ఏదైనా ఉందా అనే కోణంలో అభిమానులు ఊహాగానాలు చేస్తున్నట్టు ప్రశాంత్‌ దృష్టికి కూడా వెళ్లిందట. ఇలాంటి పరిస్థితుల్లో కెజిఎఫ్‌3పై ప్రశాంత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.