English | Telugu
త్రివిక్రమ్ తో మళ్ళీ రిస్క్ చేస్తున్న మహేష్ బాబు!
Updated : Jun 18, 2024
దర్శకుడిగా త్రివిక్రమ్ (Trivikram) 12 సినిమాలు చేస్తే.. అందులో తొమ్మిది సినిమాలు ముగ్గురు హీరోలతో చేసినవే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్ (Allu Arjun), మహేష్ బాబు (Mahesh Babu)తో మూడేసి సినిమాలు చేశాడు. పవన్ కి 'జల్సా'తో హిట్, 'అత్తారింటికి దారేది'తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అలాగే అల్లు అర్జున్ కి 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో మంచి విజయాలను అందించిన త్రివిక్రమ్.. 'అల వైకుంఠపురములో' తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కానీ మహేష్ బాబుతో మాత్రం అలాంటి మ్యాజిక్ చేయలేకపోయాడు. 'అతడు', 'ఖలేజా' సినిమాలు కల్ట్ క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయి కానీ.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయలేకపోయాయి. ముచ్చటగా మూడోసారి చేతులు కలిపి 'గుంటూరు కారం' చేయగా.. దారుణంగా నిరాశపరిచింది. దీంతో ఎలాగైనా మహేష్ బాబుకి బిగ్ హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.
ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ సినిమా (SSMB 29) చేయడానికి సిద్ధమవుతున్నాడు మహేష్. ఈ సినిమా రావడానికి కనీసం రెండు మూడేళ్లు పట్టే అవకాశముంది. ఈ సినిమా తర్వాత మహేష్ రేంజ్ మరింత పెరిగి, పాన్ ఇండియా స్టార్ గా అవతరిస్తాడు అనడంలో సందేహం లేదు. రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత మహేష్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే ఉంటాయి. అందుకోసం త్రివిక్రమ్ ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టాడట. పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా అదిరిపోయే స్టోరీ లైన్ ని రెడీ చేసి.. మహేష్ కి వినిపించాడట. ఆ స్టోరీ లైన్ కి ఇంప్రెస్ అయిన మహేష్.. రాజమౌళి ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయ్యాక దీని గురించి డిస్కస్ చేద్దామని సానుకూలంగా స్పందించాడట.
ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ సినిమా కమిటై ఉన్నాడు. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసే అవకాశముంది. ఈలోపు మహేష్-రాజమౌళి సినిమా కూడా పూర్తవుతుంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే.. రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత మహేష్ చేసే సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.