English | Telugu

అట్లీ మాస్టర్‌ ప్లాన్‌కి సల్మాన్‌ రెడీ.. మరి రజినీకాంత్‌ మాటేమిటి?

గత ఏడాది షారూఖ్‌ఖాన్‌కి ‘జవాన్‌’తో వెయికోట్ల సినిమా ఇచ్చి దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు అట్లీ. అతను నెక్స్‌ట్‌ చేయబోయే సినిమా అల్లు అర్జున్‌తో అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ బాలీవుడ్‌లో మరో ఖాన్‌ అయిన సల్మాన్‌ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందంటే మరో సంచలనానికి వీరు శ్రీకారం చుట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. బన్నితో చెయ్యాలనుకున్న సబ్జెక్ట్‌తోనే సల్మాన్‌తో చేస్తున్నాడా లేక మరో సబ్జెక్ట్‌ రెడీగా ఉందా అనే విషయంలో క్లారిటీ లేదు. ఆల్రెడీ షారూక్‌తో ఒక రేంజ్‌ హిట్‌ తీసిన అట్లీతో సల్మాన్‌ సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో సల్మాన్‌తోపాటు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కూడా తోడవుతున్నారని సమాచారం. నార్త్‌ నుంచి సల్మాన్‌, సౌత్‌ నుంచి రజినీకాంత్‌ సినిమాలో ఉంటే అది అసలైన బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా మూవీ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు అతి పెద్ద మల్టీస్టారర్‌ మూవీ అవుతుంది. గత ఏడాది ఒక్క స్టార్‌తోనే వెయ్యి కోట్లు కొల్లగొట్టిన అట్లీకి ఇద్దరు స్టార్‌ హీరోలను ఇస్తే బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తాడని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. రజినీకాంత్‌ని ఈ సినిమాలో చేర్చాలనే ప్రయత్నాలు అట్లీ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయంలో పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఎందుకంటే రజినీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన తర్వాత మరో హీరోతో కలిసి సినిమా చెయ్యలేదు. ఒకటి, రెండు గెస్ట్‌ రోల్స్‌ చేశారు తప్ప పూర్తిస్థాయి హీరోగా మరో హీరో సినిమాలో కనిపించలేదు. 

రజినీకాంత్‌ అలా చెయ్యకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. రజినీ కెరీర్‌ ప్రారంభంలో కమల్‌హాసన్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అలా చెయ్యడం వల్ల రెమ్యునరేషన్‌ విషయంలో ఇద్దరూ నష్టపోతున్నారని గ్రహించారు రజనీ, కమల్‌. అందుకే ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తామిద్దరం కలిసి నటించబోమని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఎనౌన్స్‌ చేశారు. ఆ తర్వాత విడి విడిగా సినిమాలు చేస్తున్నప్పుడు రెమ్యునరేషన్‌ ఇద్దరికీ భారీగానే అందేదట. ఇది జరిగి 40 సంవత్సరాలు అవుతోంది. సూపర్‌స్టార్‌గా ఎదిగిన తర్వాత దాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు రజినీ. 

మరో హీరోతో కలిసి రజినీ సినిమా చేసేలా గతంలో ఏ డైరెక్టరూ ప్రయత్నించలేదు. ఇప్పుడు అట్లీ ఆ సాహసానికి పూనుకుంటున్నాడు. మరి దీనికి రజినీ నుంచి ఎలాంటి రియాక్షన్‌ వస్తుందో తెలీదుగానీ టాక్స్‌ మాత్రం జరుగుతున్నాయని తెలుస్తోంది. అట్లీ వేసిన ఈ మాస్టర్‌ ప్లాన్‌ ఇద్దరు సూపర్‌స్టార్స్‌ని కలుపుతుందో లేదో చూడాలి. అదే జరిగితే ఇది పెద్ద సంచలనంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.