English | Telugu

వైఎస్ జగన్ నుంచి ప్రాణ ముప్పు.. వణికిపోతున్న రామ్ గోపాల్ వర్మ?

పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు.. తాను ఏ పార్టీ కోసమైతే పని చేస్తున్నానో, ఆ పార్టీ చేతిలోనే ప్రాణాలు కోల్పోతానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వణికిపోతున్నాడట. వైసీపీ కోసం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కోసం ఆర్జీవీ పనిచేస్తున్నాడు అనేది బహిరంగ రహస్యం. వైసీపీకి రాజకీయ లబ్ది చేకూర్చేలా వర్మ పలు సినిమాలు చేస్తున్నాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'వ్యూహం' వంటి సినిమాలు ఆ కోవలోకి చెందినవే. అలాంటి వర్మ ఇప్పుడు వైసీపీ నుంచి, జగన్ నుంచి తనకు ప్రాణముప్పు ఉందని గుక్కపెట్టి ఏడుస్తున్నాడట. ప్రస్తుతం ఇది ఆయన సన్నిహిత వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే నాయకులు ఆవేశంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, అవి ప్రకటనలకే పరిమితం కావడం అనేది సహజం. కానీ ఆర్జీవీ మాత్రం తన విషయంలో ఈ ప్రకటన నిజం అవుతుందని భయపడుతున్నాడట. అంతేకాదు, ప్రత్యర్థి పార్టీల నుంచి కాకుండా.. తాను భుజాన వేసుకొని మోస్తున్న వైసీపీ నుంచే తన ప్రాణాలకు హాని ఉందని సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.

వైసీపీకి రక్తచరిత్ర కొత్త కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు సొంత బాబాయ్ నే హతమార్చి, తెలుగుదేశం పార్టీ మీద నింద మోపి, ఆ ఎన్నికల్లో లబ్ది పొందారనే ఆరోపణలున్నాయి. అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ 2023 ఎన్నికలకు ముందు కూడా తల్లినో, చెల్లినో హతమార్చే అవకాశముందని సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వర్మ పేరు తెరపైకి వచ్చింది. 

వైసీపీ అండ్ కో, త్వరలో తనని చంపేస్తారంటూ వర్మ తన సన్నిహితులు వద్ద కంటతడి పెట్టుకుంటున్నాడట. తనని హత్య చేసి, కొలికపూడి పిలుపుతో తెలుగుదేశం నేతలే ఈ హత్య చేశారంటూ, వారి మీదకి నెట్టే కుట్ర జరుగుతుందని ఆర్జీవీ ఆవేదన చెందుతున్నాడట. బాబాయ్ హత్య విషయంలో ప్రజలకు నిజానిజాలు తెలిసేలోపు, వైసీపీ బోలెడంత సానుభూతి పొంది ఓట్లు రాబట్టుకుందనేది కొందరి వాదన. ఇప్పుడు తనని కూడా చంపేసి, అది టీడీపీ మీద తోసేసి.. ప్రజల్లో ఆ పార్టీ పట్ల దురాభిప్రాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని వర్మ చెప్పుకొని బాధపడుతున్నాడట.

సొంత బాబాయ్ నే చంపుకున్నోళ్ళు, తనని హతమార్చడానికి ఏమాత్రం వెనకాడరని, ఇలాంటి పార్టీ కోసం పని చేసి తప్పు చేశానని ఆర్జీవీ తలబాదుకుంటున్నాడట. రాత్రుళ్ళు నిద్ర కూడా పోకుండా, ఫుల్ గా మద్యం సేవిస్తూ భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నాడట. అంతేకాదు అసలు ఈ ఎన్నికలు ముగిసేవరకు వేరే రాష్ట్రంలోనో లేక వేరే దేశంలోనో తలదాచుకుంటే నయమని వర్మ భావిస్తున్నాడట. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టు.. ఈ ఆర్జీవీ ప్రాణ ముప్పు గుట్టు ఆ జగన్నాధుడికే తెలియాలి.