English | Telugu

రజనీకాంత్‌ సినిమాలో విలన్‌గా లారెన్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

‘జైలర్‌’ సూపర్‌హిట్‌ అవ్వడంతో ఆ ఉత్సాహంతోనే రజనీకాంత్‌ తన తదుపరి సినిమాల షూటింగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రూపొందుతున్న 169వ సినిమా ‘లాల్‌ సలామ్‌’ షూటింగ్‌ పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌ వుంటుంది. ‘జై భీమ్‌’ దర్శకుడు టిజి జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 170వ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, విలన్‌గా రానా, కొడుకుగా ఫహాద్‌ ఫాజిల్‌, మరో పాత్రలో మంజూ వారియర్‌ నటిస్తున్నారు. 

రజనీకాంత్‌ 171వ సినిమా లోకేష్‌ కనకరాజ్‌ డైరెక్షన్‌లో చేయబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. ఇప్పుడు అందరూ  రజనీకాంత్‌ 171వ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. ఇందులో మెయిన్‌ విలన్‌గా లారెన్స్‌ నటించబోతున్నాడనేది ఆ వార్త. రజనీకాంత్‌కు వీరాభిమాని అయిన లారెన్స్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తాడనే వార్త నిజమే అయితే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరడం ఖాయమని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని సమకూరుస్తారు. ఈ సినిమా లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగం కాదని తెలుస్తోంది.