English | Telugu

ధనుష్‌ సినిమాకి బయ్యర్లు కరవు.. కారణం అదేనా?

ప్రేక్షకుల్లో తెలుగు ప్రేక్షకులు వేరయా.. అన్నట్టుగా మన తెలుగు వారు తెలుగు సినిమాలను, తెలుగు హీరోలనే కాదు, ఇతర భాషా చిత్రాలను, ఆయా హీరోలను కూడా ఎంతో అభిమానిస్తారు. మంచి సినిమా ఏదైనా దాన్ని భుజాలపై వేసుకొని ఘనవిజయాన్ని అందిస్తారు. ముఖ్యంగా కొందరు తమిళ్‌ హీరోలకు తెలుగులోనూ వీరాభిమానులు ఉన్నారు. అందుకే తమిళ్‌ మేకర్స్‌ తెలుగు మార్కెట్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తుంటారు. గతంలో అయితే సినిమా రిలీజ్‌ అయి అక్కడ విజయం సాధించిన తర్వాత తెలుగులో దాన్ని అనువదించేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. అన్ని భాషల్లోనూ ఏకకాలంలో రిలీజ్‌ చేసే సంప్రదాయం వచ్చేసింది. ఆ విధంగా ఇతర భాషా చిత్రాల హీరోలు తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. 

తెలుగులో ఎక్కువ ఫాలోయింగ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో సూర్య, కార్తీ, విశాల్‌, ధనుష్‌లను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వీరు హీరోలుగా నటించిన సినిమాలు ఎన్నో సూపర్‌హిట్‌ సాధించాయి. ముఖ్యంగా ధనుష్‌కి తెలుగులో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ సంవత్సరం ఆరంభంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘సార్‌’తో సూపర్‌హిట్‌ అందుకున్న ధనుష్‌ దాని తర్వాత ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అనే పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్‌ చెయ్యాలని మేకర్స్‌ భావిస్తున్నారు. బ్రిటీష్‌ కాలం నాటి కథ కావడంతో ఓ డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఈ సినిమాకి సెట్‌ అయ్యింది. అరుణ్‌ మాథేశ్వరన్‌ ఈ చిత్రానికి దర్శతక్వం వహిస్తున్నారు. ధనుష్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా ఇది. కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌, టాలీవుడ్‌ నుంచి సందీప్‌ కిషన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

ధనుష్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉన్న దృష్ట్యా ఈ సినిమా తెలుగు వెర్షన్‌ బిజినెస్‌ విషయంలో నిర్మాతలకు మంచి ఎక్స్‌పెకేషన్స్‌ ఉన్నాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను తెలుగులో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. ఎందుకంటే ఈ సంక్రాంతికి చాలా తెలుగు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతికి తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటిది డబ్బింగ్‌ సినిమాకు ఆశించిన కలెక్షన్లు రావని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. అదీగాక ధనుష్‌కి తెలుగులో వున్న మార్కెట్‌ దృష్ట్యా మేకర్స్‌ ఎక్కువ రేట్లు చెబుతుండడం కూడా ఒక కారణం.