English | Telugu

'బంగార్రాజు' దర్శకుడితో మెగాస్టార్!

ఇటీవల 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే పలు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. మారుతి, త్రినాథరావు నక్కిన, వీవీ వినాయక్ వంటి దర్శకులతో ఆయన సినిమాలు చేసే అవకాశముందని వార్తలొచ్చాయి. తాజాగా మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది.

'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'బంగార్రాజు' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కోసం ఆయన ఓ కథను చేసినట్లు సమాచారం. చిరంజీవి సైతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ, కథ వినడానికి టైం ఇచ్చారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే మెగాస్టార్-కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యే అవకాశముందని టాక్.