English | Telugu
'సలార్'లో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్!
Updated : Feb 13, 2023
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 'బాహుబలి', 'కేజీఎఫ్' తర్వాత ఆ స్థాయిలో సంచలనం సృష్టించే సినిమా ఇదే అవుతుందని భావిస్తున్నారంతా. వాటి తరహాలోనే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల మళ్ళీ ఒక్క భాగమే ఉండొచ్చని కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రావడం ఖాయమని.. మొదటి భాగం ఈ ఏడాది విడుదలై, రెండో భాగం మాత్రం రెండు మూడేళ్ళ తర్వాత వచ్చే అవకాశముందని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే 'సలార్'లో ప్రశాంత్ నీల్ బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
'సలార్' తర్వాత ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమా. అంతేకాదు ఎన్టీఆర్ 32వ సినిమాకి కూడా ప్రశాంత్ నీలే దర్శకుడని ప్రచారం జరుగుతోంది. ఆ వార్తల్లో నిజమెంతో తెలియదు గానీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. 'సలార్'లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి గతంలో యశ్ కనిపిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న ఎన్టీఆర్ 31 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతకంటే ముందుగానే ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో మెరిస్తే ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు.