English | Telugu
'ఎన్టీఆర్ 30'లో విలన్ గా చియాన్ విక్రమ్!
Updated : Feb 8, 2023
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రం కోసం బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ప్రముఖ నటులను రంగంలోకి దించబోతున్నారు. ముఖ్యంగా విలన్ గా కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పాన్ ఇండియా మూవీల కోసం ఇతర భాషలకు చెందిన స్టార్స్ ని తీసుకురావడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు 'ఎన్టీఆర్ 30' విషయంలోనూ అదే జరగనుందని అంటున్నారు. నిజానికి ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే మూవీ టీమ్ సైఫ్ తో పాటు చియాన్ విక్రమ్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ లో బెస్ట్ యాక్టర్స్ లో విక్రమ్ ఒకడు. ఆయన, ఎన్టీఆర్ కలిసి పోటాపోటీగా నటిస్తే సినిమా మరోస్థాయికి వెళ్తుందని టీమ్ భావిస్తోందట. అందుకే విలన్ గా విక్రమ్ ని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు కుదిరి 'ఎన్టీఆర్ 30'లో విలన్ గా చేయడానికి విక్రమ్ అంగీకరిస్తే సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి అనడంలో సందేహం లేదు.