English | Telugu

'RC 16'లో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్!

'సీతా రామం'తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే అందరినీ ఫిదా చేసింది. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టి ఆమెపై పడింది. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సరసన 'నాని 30'లో నటించే అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ.. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా నటించే అవకాశం దక్కించుకుందని సమాచారం.

ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాని చేస్తున్న రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ ఈ సినిమాని నిర్మించనుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఈ న్యూస్ నిజమైతే ఒక్కసారిగా మృణాల్ దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు.

'ఉప్పెన'తో కృతి శెట్టిని హీరోయిన్ గా పరిచయం చేసిన బుచ్చిబాబు.. తన సినిమాల్లో హీరోయిన్స్ ని ఎలా చూపిస్తాడనేది మొదటి సినిమాతోనే క్లారిటీ ఇచ్చేశాడు. రామ్ చరణ్ చేస్తున్న ఈ చిత్రంలోనూ హీరోయిన్ ని అదే స్థాయిలో చూపిస్తే తెలుగులో మృణాల్ ఠాకూర్ స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోతుందని అనడంలో సందేహం లేదు.