English | Telugu

Guntur Kaaram : 'గుంటూరు కారం'లో ఎన్టీఆర్ స్పెషల్ రోల్.. ఫ్యాన్స్ కి పూనకాలే!

ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుందని అభిమానులు కోరుకునే స్టార్ హీరోల ద్వయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. వీరి మధ్య ఎంతో అనుబంధముంది. మహేష్ ని ఎన్టీఆర్ అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తాడు. 'భరత్ నేను నేను' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, 'ఎవరు మీలో కోటీశ్వరులు' టీవీ షోలో వీరి మధ్య అనుబంధం చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తే చూడాలని ఎందరో కోరుకుంటున్నారు. అయితే త్వరలోనే వారి కోరిక నెరవేరే అవకాశముంది. ఈ ఇద్దరు స్టార్స్ కాంబోలో మల్టీస్టారర్ అయితే రావడంలేదు కానీ, మహేష్ సినిమాలో ఎన్టీఆర్ స్పెషల్ రోల్ లో సందడి చేయనున్నాడట.

'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మూవీలో బిగ్ సర్ ప్రైజ్ ఉందట. ఇందులో ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. నిడివి కొన్ని నిమిషాలే అయినప్పటికీ, అది సినిమాకి చాలా కీలకమైన పాత్రట. పైగా అది ఖచ్చితంగా స్టార్ హీరో చేయాల్సిన వెయిట్ ఉన్న పాత్రట. అందుకే త్రివిక్రమ్, ఆ రోల్ లో ఎన్టీఆర్ కనిపిస్తే బాగుంటుందని భావించి.. ఆయనను సంప్రదించారట.

మహేష్ తో పాటు త్రివిక్రమ్, హారిక & హాసిని బ్యానర్ తో కూడా ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది. గతంలో వీరి కాంబోలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా వచ్చింది. ఆ అనుబంధంతోనే ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా 'గుంటూరు కారం'లో స్పెషల్ రోల్ చేయడానికి ఓకే చెప్పాడట. 'గుంటూరు కారం' కూడా 'అరవింద సమేత' తరహాలో పొలిటికల్ టచ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ డ్రామా. ఇందులో మహేష్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఇక ఎన్టీఆర్ కనిపించబోయే పాత్ర 'అరవింద సమేత'లోని వీరసింహారెడ్డి పాత్ర అయినా ఆశ్చర్యంలేదు అంటున్నారు. వీరసింహారెడ్డి పాత్రలో ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించాడు. ఇప్పుడదే పాత్రతో గుంటూరు కారంలో కొద్ది నిమిషాలు కనిపిస్తే గూస్ బంప్స్ వస్తాయి. మొత్తానికి గుంటూరు కారంలో ఎన్టీఆర్ నటించడం నిజమైతే మాత్రం ఇరు హీరోల అభిమానులకు పూనకాలే అనడంలో సందేహంలేదు.