English | Telugu

థమన్‌ మళ్ళీ మొదలెట్టేశాడా? ఈ విషయం మహేష్‌కి తెలిస్తే..!

ఏ సినిమాకైనా కథ, కథనం, దర్శకత్వ ప్రతిభ, సినిమాటోగ్రఫీ అనేవి ప్రాథమికంగా ఉండాల్సిన అంశాలు. అన్నింటినీ మించి సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఒకప్పటి సినిమాల్లో ఇది స్పష్టంగా కనిపించేది. రాను రాను హీరో ఇమేజ్‌, డైరెక్టర్‌ టేకింగ్‌, టెక్నికల్‌ వాల్యూస్‌ వంటి వాటి వల్ల సంగీతం యొక్క ప్రాధాన్యం తగ్గింది. సినిమాలో పాటలు ఉండాలి అనే సంప్రదాయాన్ని పాటిస్తూ  మొక్కుబడిగా సంగీత దర్శకుడ్ని ఎంచుకుంటున్నారు. ఈ డిజిటల్‌ యుగంలో టెక్నికల్‌గా సినిమాలు ఎంత గొప్పగా తీసినా కొంతమంది దర్శకులు మాత్రం సంగీతానికి ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఒకరు. తన సినిమాలో కథ, కథనం, మాటలు ఎంత అందంగా వుండాలనుకుంటాడో సంగీతం కూడా అదే స్థాయిలో వుండాలని కోరుకుంటాడు. దానికి తగ్గట్టుగానే మ్యూజిక్‌ డైరెక్టర్‌ని సెలెక్ట్‌ చేసుకొని తనకు కావాల్సిన స్వరాల్ని అతని నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో కూడా స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ తీసుకుంటాడు. ఇలాంటి డైరెక్టర్లతో పనిచేసేటపుడు తన ఒరిజినల్‌ టాలెంట్‌నే ఉపయోగించాలి తప్ప ఎక్కడో విన్న మ్యూజిక్‌ ఇన్‌స్పిరేషన్‌గానో, యాజిటీజ్‌గానో తీసుకొని చేస్తానంటే కుదరదు. ఒకప్పుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ అంటే డప్పుల మోత తప్ప సంగీతం లేదు అనుకునేవారు. ప్రతి పాటా ఎక్కడో విన్న ఫీలింగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌కి కలిగేది. అయితే దాన్ని అధిగమించి తనలోని టాలెంట్‌ని బయటికి తీసి అద్భుతమైన పాటలు చేశాడు. ఒక్కసారిగా టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎదిగిపోయి, కొంతమంది మ్యూజిక్‌ డైరెక్టర్లను వెనక్కి నెట్టేశాడు. ఇప్పుడు ఏ సినిమా చూసినా సంగీత దర్శకుడు థమన్‌ అనే పేరే కనిపిస్తుంది. అంతటి పేరు తెచ్చుకున్న థమన్‌ ఒక కాపీ ట్యూన్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చేశాడంటే నమ్ముతారా? అదే జరిగిందని చెబుతున్నారు నెటిజన్లు. మరొక భాషలో సూపర్‌హిట్‌ అయిన సంగీతాన్ని దిగుమతి చేసుకొని తమ సొంత ట్యూన్‌ అని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా ఇట్టే తెలిసిపోతోంది. ఇప్పుడు థమన్‌ విషయంలో అదే జరిగింది. ప్రస్తుతం మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో చేసిన రెండు సినిమాలు ఆడియోపరంగా పెద్ద హిట్‌ అయ్యాయి. ఇప్పుడదే సెంటిమెంట్‌తో ‘గుంటూరు కారం’ చిత్రానికి కూడా థమన్‌తోనే సంగీతం చేయిస్తున్నాడు త్రివిక్రమ్‌.
ఇదిలా ఉంటే పవన్‌కళ్యాణ్‌, సుజిత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఒజి’ చిత్రానికి థమన్‌ సంగీత దర్శకుడు. ఈ సినిమా గ్లింప్స్‌ పవర్‌స్టార్‌ బర్త్‌డేకి విడుదలైంది. పూర్తి యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వున్న ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయిందని కొందరు అంటుంటే, కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమాని గుర్తు చేసిందని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. వీటన్నింటినీ మించి వచ్చిన మరో కామెంట్‌ ఏమిటంటే.. అది కాపీ ట్యూన్‌ అని. ఎలక్ట్రానిక్‌ ప్లే లిస్ట్‌లో వున్న స్ప్లాషర్‌ అనే బిట్‌ నుంచి ‘ఒజి’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని కాపీ చేసినట్టు నెటిజన్లు ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. దీంతో థమన్‌ టాలెంట్‌ ఏమిటో అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం మహేష్‌ వరకు వెళ్ళిందంటే అప్పుడు పరిస్థితి ఎలా వుంటుందో? ఎందుకంటే కేవలం త్రివిక్రమ్‌ ఆబ్లిగేషన్‌ మీదే మహేష్‌ ‘గుంటూరు కారం’ సినిమాకి థమన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఓకే అన్నాడని తెలుస్తోంది. మరి థమన్‌ ఈ విపత్తు నుంచి ఎలా బయటపడతాడో, ఈ అపవాదు నుంచి ఎలా తప్పించుకుంటాడో చూడాలి.